బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసిన కూటమి ప్రతినిధి యెరిచెర్ల హనీ స్పందన తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇస్తర్ల షెర్లీపై ఏకంగా 6,468 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నారు. 1948లో చీరాల మున్సిపాలిటీ ఏర్పాటైనప్పటి నుండి, దాదాపు 80 ఏళ్ల చరిత్రలో.. ప్రత్యక్ష ఎన్నికల పరంగా చూస్తే.. గత 40 ఏళ్లలో టీడీపీ ఇక్కడ నేరుగా చైర్‌పర్సన్ పదవిని సొంతం చేసుకోవడం ఇదే ప్రథమం కావడంతో ఈ ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
తుఫాను ప్రభావం కారణంగా వాయిదా పడి, శుక్రవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచే టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 44 వార్డులకు గాను కూటమి ఏకంగా 25 స్థానాలను కైవసం చేసుకుని తన పట్టును నిరూపించుకుంది. ఇందులో టీడీపీ ఒంటరిగానే 22 వార్డులలో జయకేతనం ఎగురవేయగా, జనసేన 2 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో విజయకేతనం ఎగురవేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన రాజకీయ వర్గాలను ఎంతగానో ఆశ్చర్యపరిచింది.
బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యక్తిగత ప్రభావంతో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుని ఏకంగా 10 వార్డులను తన ఖాతాలో వేసుకుంది. కాగా, గతంలో బలంగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఈసారి ప్రభావం కోల్పోయి కేవలం 8 వార్డులకే పరిమితమై మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో మొత్తం 69,557 ఓట్లకు గాను 51,113 ఓట్లు పోలవగా.. అందులో 1,300 ఓట్లు చెల్లనివిగా తేలాయి. విజేతగా నిలిచిన టీడీపీ అభ్యర్థి హనీ స్పందనకు 21,883 ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇస్తర్ల షెర్లీకి 15,415 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మేడిత దివ్య సుధాకర్‌కు 11,025 ఓట్లు దక్కాయి.






