తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న మంత్రి కొండా సురేఖ తాజా వ్యవహారం ఒక్కసారిగా పూర్తిగా యూటర్న్ తీసుకుంది. ఆమెపై పార్టీ క్రమశిక్షణా చర్యలు లేదా వేటు పడే అవకాశం ఉందంటూ సాగిన ప్రచారానికి భిన్నంగా, అధిష్ఠానం నుంచి సురేఖకు కొండంత దన్ను లభించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇద్దరు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీలు, ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు కీలక మంత్రులు, అలాగే పీసీసీ (PCC) ముఖ్య నేతలు ప్రస్తుతం ఆమె వెంటే నడుస్తున్నట్లు తెలంగాణా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ వ్యవహారంలో కొండా సురేఖపై ఎలాంటి కఠిన నిర్ణయాలు లేదా వేటు వేసినా, రాష్ట్రంలో బలమైన సామాజికవర్గంగా ఉన్న బీసీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని అధిష్ఠానం పెద్దలు భావించినట్లు తెలుస్తోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళా నేత కావడంతో ఆమెను ఈ వివాదంలో వదిలించుకుంటే రాజకీయంగా పార్టీకి పెద్ద నష్టం జరుగుతుందనే లెక్కలతోనే జాతీయ నాయకత్వం ఆమెకు అండగా నిలిచేందుకు మొగ్గు చూపినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు, కొండా సురేఖకు ఢిల్లీ పెద్దలతో పాటు రాష్ట్రంలోని కీలక నేతల నుంచి భారీగా మద్దతు లభిస్తుండటంతో సీఎం క్యాంపులో తీవ్ర ఉత్కంఠ మరియు ఆందోళన నెలకొంది. ఆమెపై చర్యల కోసం ఒత్తిడి తెస్తున్న శక్తులకు అధిష్ఠానం తీసుకున్న ఈ తాజా వైఖరి గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రాజకీయ లొల్లి రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరగబోతుందోనని గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.






