అన్ని రంగాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక అడుగు ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని దాదాపు 2.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు నిరంతర సాగునీరు అంది, అక్కడి వ్యవసాయ రంగం పూర్తిగా స్థిరీకరణ చెందుతుందని లోకేష్ వివరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ‘సమగ్రాభివృద్ధి.. సర్వతోముఖాభివృద్ధి’ అనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర రీజియన్‌కు అనేక పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొచ్చి స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించామని, ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ పవిత్ర గోదావరి జలాలను అందిస్తున్నామని చెప్పారు. పరిశ్రమలతో పాటు సాగునీటి ప్రాజెక్టులను సమాంతరంగా పరుగులు పెట్టించడం ద్వారా ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలబెడతామని మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.






