Home ఆంధ్రప్రదేశ్ లోకనాథం ఇంట్లో ఏసీబీ రైడ్స్‌తో ఉలిక్కిపడ్డ భూమన..!

లోకనాథం ఇంట్లో ఏసీబీ రైడ్స్‌తో ఉలిక్కిపడ్డ భూమన..!

0
3

తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు జరిపిన భారీ సోదాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డిని తీవ్ర ఉలిక్కిపాటుకు గురిచేశాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే బలమైన ఆరోపణలతో ఏకకాలంలో ఐదు చోట్ల ఏసీబీ తనిఖీలు ముమ్మరంగా సాగుతుండగానే, భూమన కరుణాకర్‌రెడ్డి రంగంలోకి దిగి సదరు అధికారిని వెనకేసుకురావడం రాజకీయ, ధార్మిక వర్గాలలో తీవ్ర కలకలం రేపుతోంది. అసలు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి భూమన ఏ ప్రాతిపదికన క్లీన్‌చిట్ ఇస్తారంటూ సర్వత్రా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

లోకనాథంపై జరుగుతున్న చట్టపరమైన ఏసీబీ చర్యలను భూమన కరుణాకర్‌రెడ్డి కేవలం ఒక ‘రాజకీయ కుట్ర’గా అభివర్ణించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శ్రీవారి కల్తీ నెయ్యి కుంభకోణం లింకులతో ముడిపడి ఉన్న అంతర్గత సమాచారం ఆధారంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ప్రచారం సాగుతుంటే.. భూమన మాత్రం ఈ మొత్తం వ్యవహారాన్ని టీటీడీ ఉన్నతాధికారుల మధ్య సాగుతున్న అంతర్గత ఆధిపత్య పోరుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైస్సార్సీపీ హయాంలో టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా పనిచేసిన భూమనే స్వయంగా ఒక నిందితుడి తరఫున వకాల్తా పుచ్చుకోవడం వెనుక అసలు రహస్యం ఏంటనే చర్చ తిరుపతిలో జోరందుకుంది.

శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రత, టీటీడీ ప్రతిష్ఠకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశంలో భూమన కరుణాకర్‌రెడ్డి ఇలాంటి దిగజారుడు రాజకీయ జోక్యానికి పాల్పడటంపై భక్తజన కోటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని భావించకుండా, దర్యాప్తు సంస్థల నైతికతను దెబ్బతీసేలా భూమన మాట్లాడుతున్నారని స్థానిక కూటమి నేతలు మండిపడుతున్నారు. ఈ ఏసీబీ దాడులతో ఎక్కడ తన అక్రమాలు కూడా బయటపడతాయోననే భయంతోనే భూమన ఇంతలా ఉలిక్కిపడి డిఫెన్స్‌లో పడ్డారని విమర్శకులు గట్టిగా విమర్శిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.