తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీడర్‌షిప్‌నకే పెను సవాల్‌గా మారింది. ఢిల్లీ వేదికగా హైకమాండ్ పెద్దలతో చర్చలు నడుస్తున్న వేళ.. కొండా సురేఖ మీడియా చిట్‌చాట్‌లో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను భూకంపాన్ని సృష్టిస్తున్నాయి. నాపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు, నిబంధనలను ఉల్లంఘిస్తూ మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై యాక్షన్ తీసుకోవాలంటూ ఆమె అధిష్ఠానం ముందే బాంబు పేల్చారు. ఈ తాజా వ్యాఖ్యలతో కాంగ్రెస్ అంతర్గత ముఠాపోరు పూర్తిగా రచ్చకెక్కింది.
చిట్‌చాట్‌లో సురేఖ మాట్లాడుతూ.. తన కుమార్తెను కొందరు కావాలనే రెచ్చగొట్టడం వల్లే ఆమె విమర్శలు చేయాల్సి వచ్చిందని, మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ గాంధీ చెప్తున్నప్పుడు తన కూతురు మాట్లాడిన దానికి తనపై చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. “పదేళ్ల పాటు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు.. అది క్రమశిక్షణా ఉల్లంఘన కిందకు రాదా? అసలు రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరనేది నిర్ణయించడానికి, బహిరంగ సభల్లో పరకాల టికెట్లను ప్రకటించడానికి సీఎంకు ఏం హక్కు ఉంది?” అంటూ రేవంత్ ఏకపక్ష పోకడలపై సురేఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రులు, పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, పలువురు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సురేఖ నిలదీశారు. పార్టీలో బీసీలకు ఒక న్యాయం, ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా అంటూ ఆమె సంధించిన ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలను డిఫెన్స్‌లో పడేశాయి. తనను రాజీనామా చేయమని ఇప్పటివరకు ఎవరూ అడగలేదని స్పష్టం చేసిన సురేఖ.. రాష్ట్రంలో జరుగుతున్న పూర్తి పరిణామాలను అధిష్ఠానానికి రాతపూర్వకంగా సమర్పించినట్లు తెలిపారు. కొండా సురేఖ ఇలా రేవంత్ రెడ్డిపై ఓపెన్ వార్ డిక్లేర్ చేయడంతో ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది.






