తమిళనాడు రాజకీయాలు సరికొత్త వివాదంతో ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చేసిన ఒక చిన్న సైగ కాస్తా.. అధికార డీఎంకే, ప్రతిపక్ష విజయ్ నేతృత్వంలోని పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం విజయ్ ప్రసంగిస్తూ.. ప్రతిపక్ష డీఎంకేపై అవినీతి ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ఆయన తన ఒక చేత్తో దవడను పట్టుకుని పైకి ఎత్తినట్లుగా ఒక సైగ చేశారు.
ఈ హావభావం మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ విరిగిన దవడను హేళన చేయడమేనంటూ డీఎంకే శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను అడ్డుకోవడం సంచలనంగా మారింది. ఈ రచ్చపై ముఖ్యమంత్రి విజయ్ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో తాను మాట్లాడేటప్పుడు జరిగిన ఆ బాడీ లాంగ్వేజ్ కేవలం అనుకోకుండా, యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప.. ఎవరినీ వ్యక్తిగతంగా అవమానించాలనే ఉద్దేశం తనకు అస్సలు లేదని స్పష్టం చేశారు.
ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసేలా దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన కోరారు. అయితే ఈ దవడ సైగ వెనుక డీఎంకేకు ఐదు దశాబ్దాల క్రితం నాటి ఒక అత్యంత బాధాకరమైన చారిత్రక సెంటిమెంట్ దాగి ఉంది. ఈ కథ దేశంలో ఎమర్జెన్సీ విధించిన 1976 నాటి కాలానికి వెళుతుంది. అప్పట్లో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసిన తర్వాత.. యువకుడిగా ఉన్న ఎం.కె. స్టాలిన్‌ను ‘మీసా’ చట్టం కింద అక్రమంగా అరెస్ట్ చేసి మద్రాస్ సెంట్రల్ జైలులో నిర్బంధించారు.
జైలు లోపల పోలీసులు జరిపిన తీవ్రమైన దాడి మరియు హింస కారణంగా స్టాలిన్ దవడ ఎముక విరిగిపోయింది. ఈ విషయాన్ని స్టాలిన్ తన ఆత్మకథ ‘ఉంగలిల్ ఒరువన్’ పుస్తకంలో కూడా రాసుకున్నారు. డీఎంకే పార్టీకి ఆ దవడ గాయం అనేది ఒక శారీరక లోపం కాదు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం స్టాలిన్ ఎదుర్కొన్న ఒక ‘వీర మచ్చ’ లాంటిదని ఆ పార్టీ భావిస్తుంది. అందుకే సీఎం విజయ్ చేసిన ఆ దవడ సైగ.. స్టాలిన్ త్యాగాలను ‘బాడీ షేమింగ్’ చేస్తూ అవమానించడమేనని, ఇది ఒక బాధ్యతారహితమైన చర్య అని విజయ్ కూటమి భాగస్వామ్య పక్షమైన సీపీఎం కూడా తీవ్రంగా ఖండించింది.






