ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి పండుగ వేడుకలను ప్రజలంతా మరింత వైభవంగా, ఉత్సాహంగా జరుపుకునేలా కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వీధివీధినా వెలిసే గణేష్ పండళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఐటీ, పర్యాటక శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు. పండుగ రోజుల్లో విద్యుత్ ఛార్జీల భారం లేకుండా స్థానిక కమ్యూనిటీలకు పూర్తి మద్దతుగా నిలిచేందుకు మరియు వేడుకలను మరింత ఉల్లాసంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ భారీ పండుగ కానుకను ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వేల సంఖ్యలో వెలిసే ఉత్సవ కమిటీలకు భారీ ఉపశమనం లభించనుంది. సాధారణంగా పండుగ రోజుల్లో లైటింగ్, డీజేలు, మైక్ సెట్ల కోసం భారీగా విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తుండటంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పండుగ కానుకను ప్రకటిస్తూ.. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంపై ఉండాలని, అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు, విజయం కలగాలని నారా లోకేష్ ఆకాంక్షించారు.














