పులివెందులను కూటమికి రాసిచ్చిన జగన్..?

0
9

వైఎస్సార్ కుటుంబానికి దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ సామ్రాజ్యంగా ఉన్న కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో తాజా మున్సిపల్ ఎన్నికల వేళ ఊహించని రాజకీయ వింత చోటుచేసుకుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికి ఉన్నంత కాలం పులివెందుల అంటే అజేయమైన కోట. అక్కడ ప్రత్యర్థి పార్టీల నేతలు అడుగుపెట్టడానికే భయపడే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ కంచుకోట బీటలు వారుతోంది.

తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల మున్సిపాలిటీలోని మొత్తం 40 వార్డులకు గానూ కేవలం 30 వార్డుల్లోనే వైఎస్సార్‌సీపీ నామినేషన్లు వేయడం, మిగిలిన 10 వార్డులను కూటమి అభ్యర్థులకు ఏకగ్రీవంగా వదిలేయడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గతంలో పార్టీ సమీక్షా సమావేశాల్లో జగన్ స్వయంగా క్యాడర్‌ను ఉద్దేశించి “ఎక్కడైనా స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఏకగ్రీవాలు జరిగితే నేను చాలా సీరియస్‌గా తీసుకుంటాను, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సదరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు సీటు ఇచ్చే ప్రసక్తే లేదు” అని కరాఖండిగా హెచ్చరించారు.

మరి ఇప్పుడు సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే 10 వార్డులు కూటమికి ఏకగ్రీవంగా దారపోసిన నేపథ్యంలో, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పులివెందుల నుండి పోటీ చేయరా..? లేక తన నిబంధన తనకే వర్తించదా..? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి పులివెందులలో వైఎస్సార్‌సీపీ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్సార్ బ్రతికున్నప్పుడు నియోజకవర్గంలో ఏకపక్షంగా సాగిన అధికారం, జగన్ హయాంలోకి వచ్చేసరికి పూర్తిగా తలకిందులైంది.

గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవడం, ఆ తర్వాత పులివెందుల రూరల్ జెడ్‌పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ దారుణంగా ఓడిపోవడం జగన్ నాయకత్వ లోపానికి అద్దం పట్టింది. ఇప్పుడు ఏకంగా మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ నామినేషన్ల ప్రక్రియలోనే వెనకడుగు వేసి, పురపాలక పీఠాన్ని కూడా కూటమికి అప్పగించే దుస్థితికి రావడం వైఎస్ కుటుంబ రాజకీయ పతనానికి నిదర్శనమని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోని నేతలను ఏకతాటిపైకి తెచ్చి, క్యాడర్‌లో ధైర్యం నింపి కోటను కాపాడుకోలేకపోయిన జగన్ మోహన్ రెడ్డి, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని ఎలా నిలబెడతారనే ఆందోళన ఇప్పుడు వైఎస్సార్‌సీపీ శ్రేణులను తీవ్రంగా వేధిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.