పార్టీని వాడుకుని వదిలేసిన వెల్లంపల్లి..?

0
10

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ క్యాడర్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, నగరంలో కీలక నేతగా అన్ని రకాల రాజకీయ లబ్ధి పొందిన వెల్లంపల్లి… ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని కార్యకర్తలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ అభ్యర్థులకు అండగా నిలవాల్సింది పోయి, ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోవడం వెనుక సొంత లాభాల వ్యూహం ఉందనే ప్రచారం నగరంలో బలంగా సాగుతోంది.

నగరంలో జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థులు ఆర్థిక బలం, అంగబలంతో దూసుకుపోతుంటే, వైసీపీ డివిజన్ అభ్యర్థులు మాత్రం కనీస మద్దతు లేక ఇబ్బంది పడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గంపై పట్టున్న వెల్లంపల్లి ఎన్నికల ఫండింగ్ గానీ, కనీసం అభ్యర్థులతో సమీక్షలు గానీ నిర్వహించడం లేదు. ఐదేళ్ల పాటు పార్టీ కోసం రాత్రింబగళ్లు కష్టపడి, ఇప్పుడు కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను వెల్లంపల్లి ఇలా నడిరోడ్డుపై వదిలేయడంపై క్యాడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీని కేవలం తన స్వప్రయోజనాల కోసమే వాడుకుని, ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

వెల్లంపల్లి శ్రీనివాస్ ఇలా కార్పొరేషన్ ఎన్నికలకు దూరం జరగడం వెనుక ఆయన రాజకీయ భవిష్యత్తు మార్చుకునే ఆలోచనలో ఉన్నారా అనే అనుమానాలు కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో వ్యక్తమవుతున్నాయి. వైసీపీ భవిష్యత్తుపై నమ్మకం లేకే ఆయన ఎన్నికల ఖర్చులకు వెనకడుగు వేస్తున్నారని, అందుకే క్యాడర్‌ను లైట్‌గా తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కీలకమైన స్థానిక పోరులో సీనియర్ నేతలే ఇలా చేతులెత్తేస్తే, క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికి దెబ్బతింటుందని, ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకోకపోతే బెజవాడ పశ్చిమలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.