పోటీకి దిక్కు లేకనే సొంత కుటుంబాన్ని దింపిన బొత్స..?

0
5

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు జిల్లాను శాసించిన బొత్స కుటుంబానికి… ఇప్పుడు సొంత సామాజికవర్గం మరియు నమ్మకమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం కరువైనట్లు స్పష్టమవుతోంది. దశాబ్దాలుగా బొత్స సత్యనారాయణకు కుడిభుజంగా ఉంటూ, జిల్లాలో వైసీపీకి ఆర్థిక, అంగబలంగా నిలిచిన మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఇటీవలే తన కుమార్తె సిరి సహస్రతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

చిన్న శ్రీను తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో విజయనగరం జిల్లాలో వైసీపీ పునాదులు పూర్తిగా కదిలిపోయాయి. ఆయన వెంటే జడ్పీటీసీ స్థాయి లీడర్ల నుంచి క్షేత్రస్థాయి ముఖ్య కార్యకర్తల వరకు పెద్ద ఎత్తున కేడర్ తరలిపోవడంతో, జిల్లాలో వైసీపీకి గ్రౌండ్ లెవెల్ నెట్‌వర్క్ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే, రాబోయే జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థానం బీసీ మహిళకు కేటాయించబడటంతో.. కూటమి తరఫున చిన్న శ్రీను తన కుమార్తెను బరిలోకి దించేందుకు పక్కా వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో, చిన్న శ్రీను దెబ్బకు ఖాళీ అయిపోయిన వైసీపీలో.. క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొని, గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులు ఎవరూ దొరకని పరిస్థితి ఏర్పడింది. పార్టీని నమ్ముకుని ఎవరైనా నిలబడితే… చిన్న శ్రీను రాజకీయ, ఆర్థిక వ్యూహాల ముందు నిలబడలేమని స్థానిక నేతలు వెనకడుగు వేసినట్లు సమాచారం. దీంతో వేరే దిక్కు లేక, మరెవరినీ నమ్మలేక.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తన సొంత కుటుంబ సభ్యులనే ఒకేసారి నలుగురిని జడ్పీటీసీ రేసులోకి దించాల్సి వచ్చిందనే విశ్లేషణలు పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినబడుతున్నాయి.

జిల్లా పరిషత్ పీఠాన్ని ఎలాగైనా తమ గుప్పిట్లోనే ఉంచుకోవాలనే తాపత్రయంతో… బొత్స తన కుమార్తె అనూష, కోడలు పూజిత, సోదరి వెంకటలక్ష్మి, తమ్ముడి కుమారుడు చైతన్యలతో వేర్వేరు స్థానాల నుండి నామినేషన్లు వేయించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 27 స్థానాలు ఉంటే, అందులో కీలకమైన 4 స్థానాలను ఒకే కుటుంబం పంచుకోవడంపై సోషల్ మీడియాలో సైతం సెటైర్లు పడుతున్నాయి. పార్టీ కోసం ఎంతోకాలంగా జెండాలు మోసిన కార్యకర్తలను, కిందిస్థాయి నాయకులను కాదని, చిన్న శ్రీను వేసిన దెబ్బకు భయపడి ఇలా ఫ్యామిలీ ప్యాక్ రాజకీయం చేయడం బొత్స బలహీనతకు నిదర్శనమని ప్రత్యర్థి కూటమి శ్రేణులు విమర్శిస్తున్నాయి. నమ్మకమైన నాయకులు లేక సొంత కుటుంబంతోనే జూదం ఆడుతున్న బొత్స వ్యూహం.. చిన్న శ్రీను గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్ ముందు ఎంతవరకు పారుతుందనేది ఇప్పుడు ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.