న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమిట్ వేదికగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. “ఈ రోజు అక్టోబర్ 23, 2026.. ఈ తేదీని గుర్తుపెట్టుకోండి.. సరిగ్గా రెండేళ్ల తర్వాత, అంటే అక్టోబర్ 23, 2028 నాటికి పూర్తి భారతీయ డిజైన్, భారత తయారీ, భారతీయ బ్రాండ్‌తో కూడిన మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి” అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. 2028 నాటికి యాపిల్, శామ్‌సంగ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజాలకు దీటుగా భారతదేశానికి సొంత మొబైల్ బ్రాండ్ వచ్చే క్షణం ఆసన్నమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఒక మొబైల్ ఫోన్‌ను డిజైన్ చేయడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని మంత్రి వివరించారు. అతి చిన్న పరికరంలో రేడియో ఫ్రీక్వెన్సీ, యాంటెన్నా, మెమరీ, కెమెరా మాడ్యూల్, డిస్ప్లే, పవర్ మేనేజ్‌మెంట్‌ను బ్యాలెన్స్ చేయడం పెద్ద సవాల్ అని చెప్పారు. మూడేళ్ల క్రితం తాము భారత డిజైనర్లకు ఇచ్చిన సవాలును స్వీకరించి, రెండు స్వదేశీ కంపెనీలు మొబైల్ మదర్‌బోర్డ్ ను విజయవంతంగా డిజైన్ చేశాయని వెల్లడించారు. అందులో ఒక భారత కంపెనీ తయారుచేసిన 5G-ప్లస్ ఫోన్ డిజైన్ ఇప్పటికే అమెరికాలోని అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఎంపికై, అక్కడ వినియోగదారులకు డెలివరీ కూడా చేయబడిందని మంత్రి ప్రకటించారు.
2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా విజన్ వల్ల దేశంలో పారిశ్రామిక రంగం రూపురేఖలు మారిపోయాయని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల కఠినమైన నిబంధనలు, పాతకాలపు చట్టాల వల్ల తయారీ రంగం పూర్తిగా స్తంభించిపోయిందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం భారతదేశం కేవలం మొబైల్స్ మాత్రమే కాకుండా డ్రోన్లు, క్షిపణులు, అత్యాధునిక రైళ్లను స్వయంగా తయారు చేస్తోందని తెలిపారు. ఒకప్పుడు ఊహించని విధంగా, నేడు భారతదేశం నుండి ఎగుమతి అవుతున్న వస్తువులలో ఎలక్ట్రానిక్స్ మూడో స్థానానికి చేరుకుందని, అతి త్వరలోనే ఇది రెండో స్థానానికి చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.














