డ్రోన్లు, మిసైళ్లు కాదు.. సౌదీపై హూతీల సరికొత్త అస్త్రం..!

0
2

మిడిల్ ఈస్ట్‌లో సౌదీ అరేబియాకు, యెమెన్‌ను పాలిస్తున్న హూతీ తిరుగుబాటుదారులకు మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే. అయితే, ఈ పోరులో హూతీలు సౌదీని దెబ్బతీయడానికి ఈసారి ఎలాంటి డ్రోన్లు, ఆధునిక క్షిపణులను వాడటం లేదు. వీటన్నింటికీ భిన్నంగా.. అమెరికాకు చెందిన దివంగత సెక్స్ అఫెండర్, ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ పేరును ఒక సరికొత్త డిజిటల్ అస్త్రంగా వాడుకుంటూ సౌదీ అరేబియాపై తీవ్రమైన ప్రచార యుద్ధానికి తెరలేపారు.

గత నెలలో సౌదీ అరేబియా ఒక సంచలన ఆరోపణ చేసింది. ముస్లింల అత్యంత పవిత్ర నగరమైన మెక్కా, కాబాను లక్ష్యంగా చేసుకుని హూతీలు డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు తెగబడుతున్నారని సౌదీ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను హూతీలు పూర్తిగా తిరస్కరించారు. తాము పవిత్ర నగరాలపై దాడులు చేయడం లేదని స్పష్టం చేస్తూనే, సౌదీపై రివర్స్ అటాక్ ప్రారంభించారు. సౌదీ ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ హూతీల అధ్యక్షుడు మహ్దీ అల్-మషాత్ తమ అధికారిక మీడియాలో ఒక సంచలన వ్యాఖ్య చేశారు.

“ఎవరైతే జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు కాబా వస్త్రాలను బహుమతిగా ఇచ్చారో, వారే ఇప్పుడు మెక్కాను టార్గెట్ చేస్తున్నారు” అంటూ సౌదీ రాయల్ కోర్టుపై ధ్వజమెత్తారు. ఇటీవల అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన జెఫ్రీ ఎప్‌స్టీన్ రహస్య పత్రాలను హూతీలు పూర్తిగా జల్లెడ పట్టారు. అందులో సౌదీ రాజకుటుంబానికి చెందిన కొందరు అసోసియేట్లు, ఇస్లాంలో అత్యంత పవిత్రమైన కాబా వస్త్రాల అలంకరణతో కూడిన కొన్ని విలువైన వస్త్రాలను అమెరికా సెక్స్ అఫెండర్ ఎప్‌స్టీన్‌కు పంపినట్లు ఉన్న నివేదికలను హూతీలు హైలైట్ చేస్తున్నారు.

ఈ ఆరోపణలను హూతీలు కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా.. పాటలు, ప్రసంగాలు, వీడియోలు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ముస్లిం ప్రపంచంలోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ఎక్స్ లో 27 లక్షల కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న ముస్తఫా అల్-మొమరి అనే ప్రముఖ యెమెన్ కమెడియన్ కూడా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌ను విమర్శిస్తూ ఈ అంశంపై ఒక ప్రత్యేక వీడియోను రూపొందించారు. ముస్లిం ప్రపంచంలో సౌదీ అరేబియాకున్న ప్రతిష్టను దెబ్బతీసి, తామే అసలైన ఇస్లాం రక్షకులమనే కలరింగ్ ఇచ్చుకోవడానికే హూతీలు ఈ వినూత్న ప్రచార వ్యూహాన్ని వాడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.