ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్..!

0
3

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడుతోంది. భారత వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఈ తీవ్ర అల్పపీడనం క్రమంగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా, ఆపై తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఈ నెల 26వ తేదీ ఉదయానికి ఇది మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అర్నాబ్ తుపానుగా మారే బలమైన సూచనలు ఉన్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ తుపాను ముప్పు నేప‌థ్యంలో ఉత్తరాంధ్ర సహా కోస్తా తీర ప్రాంతాలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.

ప్రస్తుత అంచనాల ప్రకారం, ఈ తుపాను మరింత తీవ్రరూపం దాల్చి ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీరాల వైపు దూసుకురానుంది. అక్టోబర్ 28వ తేదీన ఈ తుపాను కాకినాడ మరియు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో.. కొన్ని చోట్ల 120 కిలోమీటర్ల వరకు భీకర గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీని ప్రభావంతో సముద్రం విపరీతంగా అలజడిగా మారుతుందని, అలలు భారీ ఎత్తున ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ముఖ్యంగా కోస్తాంధ్రా, ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

సముద్రం తీవ్రంగా హీటెక్కి, అలజడిగా మారనున్నందున అక్టోబర్ 25 నుంచి మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే సమీప తీరాలకు తిరిగి రావాలని కోరారు. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగం అంతా అప్రమత్తమై పునరావాస కేంద్రాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. గతంలో వచ్చిన హుదూద్, తిత్లీ తుపాన్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.