ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏలూరు జిల్లా పరిషత్ పీఠం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జెడ్పీ చైర్పర్సన్ పదవిని దక్కించుకోవడానికి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నేతల కుటుంబాల మధ్య పోటీ తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి తరఫున జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తాజాగా ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్‌ను మాజీ ఎంపీ మాగంటి బాబు దంపతులు ప్రత్యేకంగా కలిశారు.
ఏలూరు జెడ్పీ చైర్‌పర్సన్‌గా తమ కుటుంబానికి, ముఖ్యంగా మాగంటి బాబు సతీమణికి అవకాశం కల్పించాలని వారు ఎంపీని కోరినట్లు సమాచారం. పార్టీ కోసం దశాబ్దాలుగా సేవలందిస్తున్న తమ నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఈ పదవి కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, దెందులూరు నియోజకవర్గం నుంచి బలమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీ కూడా ఎంపీ పుట్టా మహేష్‌ను కలిసి జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.
ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చింతమనేని కుటుంబానికి ఉన్న పట్టు, క్రియాశీల పాత్ర నేపథ్యంలో నవ్యశ్రీ అభ్యర్థిత్వంపై పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇలా ఒకే పార్టీ నుంచి ఇద్దరు ప్రముఖుల కుటుంబాలు జెడ్పీ పీఠం కోసం పోటీపడుతుండటంతో, తుది నిర్ణయం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. స్థానిక ఎన్నికల ఫలితాలు, పార్టీ అధిష్టానం చేసే సర్దుబాట్ల ఆధారంగా ఏలూరు జెడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందనేది త్వరలోనే స్పష్టత రానుంది.














