కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, సంగీత ప్రపంచంలో సరికొత్త శకానికి నాంది పలికిన భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర వెండితెరపైకి రానుంది. ఆమె 110వ జయంతిని పురస్కరించుకుని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అధికారికంగా పట్టాలెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, బివి వర్క్స్ పతాకాలపై ప్రముఖ అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాసు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ఈ సినిమా అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 16, 2026 బుధవారం సాయంత్రం 6:00 గంటలకు చెన్నైలోని ప్రతిష్టాత్మక ‘ది మ్యూజిక్ అకాడమీ’ ప్రాంగణంలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరగనుంది. ఈ చారిత్రాత్మక సినిమా ముహూర్తపు వేడుకకు లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించనున్నారు. ఈ ప్రారంభోత్సవంలో ఇండియన్ కోరల్ ఎన్‌సెంబుల్ బృందం అందించే ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి ఐకానిక్ గీతాల లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, వేడుకకు హాజరయ్యే వారందరికీ ‘ఎంఎస్ బ్లూ’ రంగు డ్రెస్ కోడ్‌ను కూడా నిర్ణయించడం విశేషం.
సుబ్బలక్ష్మి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. ఒక సంగీతదిగ్గజం పాత్రను పోషించడం రష్మిక కెరీర్‌లోనే ఓ సవాల్ అని చెప్పవచ్చు. ఈ పాత్ర కోసం రష్మిక మందన్న కర్ణాటక సంగీత కళాకారిణిలతో కలిసి నిర్వహించే ప్రత్యేక వర్క్‌షాప్‌లలో పాల్గొని, ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోనుంది. ఆమె హావభావాలు, క్రమశిక్షణ, సుబ్బలక్ష్మి వ్యక్తిత్వాన్ని ఏమాత్రం తక్కువ కాకుండా స్క్రీన్ పై పండించేందుకు మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు రేపటి లాంచ్‌లో వెల్లడి కానున్నాయి.





