Home ఆంధ్రప్రదేశ్ పల్నాడు వాటర్ గ్రిడ్‌పై తెలంగాణాకు లావు కౌంటర్..!

పల్నాడు వాటర్ గ్రిడ్‌పై తెలంగాణాకు లావు కౌంటర్..!

0
6

నాగార్జునసాగర్ నుంచి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయ నేతలు చేస్తున్న ఆరోపణలను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్రంగా ఖండించారు. సాగర్‌కు గండి కొట్టి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోందంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ సహా తెలంగాణ నాయకులు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కృష్ణా జలాల అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ ప్రాజెక్టు ఉద్దేశాన్ని వివరిస్తూ.. దశాబ్దాలుగా తీవ్ర తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న పల్నాడు ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడానికే ఈ వాటర్ గ్రిడ్‌ను చేపట్టినట్లు ఎంపీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ‘జలజీవన్ మిషన్’ ద్వారా సుమారు రూ. 1,200 కోట్ల వ్యయంతో పల్నాడులోని 11 మండలాల్లో ఉన్న 363 గ్రామాలకు ఇంటింటికీ నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే దీని ప్రధాన లక్ష్యమని వివరించారు. ఇది సాగునీటి ప్రాజెక్టు కాదని, కేవలం 10 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాల కోసమే నిర్మిస్తున్నామని ఆయన స్పష్టత ఇచ్చారు.

నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధంగా కేటాయించిన నీటి వాటాకు లోబడే ఈ గ్రిడ్ ద్వారా నీటిని వినియోగించుకుంటున్నామని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. సుమారు 1.865 టీఎంసీల నీటిని మాత్రమే తమ వాటా నుంచి వాడుకుంటున్నామని, ఇందులో ఎలాంటి నీటి చౌర్యం జరగడం లేదని తేల్చి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య అపోహలు సృష్టించేలా తెలంగాణ నేతలు మాట్లాడటం తగదని, వాస్తవాలను తెలుసుకుని విమర్శలు చేయాలని ఆయన హితవు పలికారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.