మనిషి పుటక పుట్టారా..? షర్మిల సంచలన కామెంట్స్

0
5

తండ్రి వయసున్న వ్యక్తికి వివాహ శుభలేఖ అందిస్తే దానిని ఆత్మీయ సంబంధాలుగా, చెట్టాపట్టాల్‌గా వర్ణిస్తారా అంటూ సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన కుమార్తె వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానిస్తే దానిని వక్రీకరించి, రాజకీయ కోణం ఆపాదించడంపై ఆమె నిప్పులు చెరిగారు. సాక్షి పత్రిక ప్రచురించిన ఆ కథనం తనతో పాటు తన కుటుంబానికి జరిగిన తీవ్రమైన వ్యక్తిత్వ హననమని, ఇది వైసీపీ మరియు ఆ పార్టీ అనుకూల మీడియా నీచపు బుద్ధికి, దిగజారుడు సంస్కారానికి పరాకాష్ట అని షర్మిల ధ్వజమెత్తారు.

సమాజంలో వావివరసలు, కనీస విలువలు మరిచిపోయి ఒక ఆడబిడ్డపై ఇలాంటి నిందలు వేయడం రాక్షస తత్వానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమేనని ఎద్దేవా చేశారు. గతంలో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం తన బిడ్డల పెళ్లిళ్లకు చంద్రబాబు నాయుడును ఆహ్వానించారని షర్మిల గుర్తుచేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే వైఎస్సార్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా అని సూటిగా ప్రశ్నించారు.

అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అంటూ కబుర్లు చెప్పే వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, తన పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తలను ఎలా సమర్ధించుకుంటారని షర్మిల నిలదీశారు. తల్లి, చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాయించడమేనా మీ ఎజెండా అని మండిపడ్డారు. జగన్, ఆయన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదని, మహిళల మీద వక్రభాష్యం చెప్పడం, అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని వారు ఇంకా మరవలేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాంటి నీచపు రాతలు రాయించినందుకు జగన్ స్వయంగా సంజాయిషీ ఇస్తారా, లేక సాక్షి పత్రికతో క్షమాపణలు చెప్పిస్తారా తేల్చుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.