అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మార్క్ మొండి వైఖరితో అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని ఒక్కసారిగా గందరగోళంలోకి నెట్టేశారు. రష్యా, ఇరాన్ దేశాలపై అమెరికా విధించిన ఆంక్షలను లెక్కచేయకుండా, ఆయా దేశాలతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్న ఇతర దేశాల ముక్కు పిండి పన్నులు వసూలు చేసేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేసేలా రూపొందించిన ‘ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్-2026’ బిల్లుపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ట్రంప్ సంతకంతో ఈ వివాదాస్పద బిల్లు ఇప్పుడు అధికారికంగా చట్టరూపం దాల్చింది.
ఈ చట్టం ప్రకారం.. అమెరికా ఆంక్షలు విధించిన రష్యా, ఇరాన్ దేశాల నుండి ముడి చమురు, రక్షణ సామాగ్రి లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే ఎగుమతులపై భారీగా అదనపు సుంకాలు విధించనున్నారు. అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ అమెరికా కొత్త ఆంక్షల పరిధిలోకి మన భారతదేశంతో పాటు చైనా సహా దాదాపు 10 దేశాలు చేరాయి. రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్‌ను టార్గెట్ చేస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ వస్తువులపై భారీగా సుంకాలు పడితే.. ఇక్కడి ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్ రంగాలపై ఆ ప్రభావం పడి భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
అంతర్జాతీయ దౌత్య నిపుణులు ఈ చర్యను డొనాల్డ్ ట్రంప్ యొక్క పక్కా శాడిజంగా అభివర్ణిస్తున్నారు. ప్రపంచ దేశాల సార్వభౌమత్వాన్ని, వాటి సొంత దేశీయ అవసరాలను గౌరవించకుండా.. “నేను చెప్పినట్టే వినాలి, లేదంటే మీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తా” అనే తరహాలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒకవైపు భారత్‌ను అత్యంత ఆప్తమిత్రదేశంగా చెప్తూనే.. మరోవైపు రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొంటున్నందుకు ఇలా కక్షపూరితంగా సుంకాల బాదుడుకు తెరలేపడం ట్రంప్ వ్యాపార మనస్తత్వానికి, శాడిజానికి నిదర్శనమని విశ్లేషకులు మండిపడుతున్నారు. చైనాతో ఎలాగూ అమెరికాకు ట్రేడ్ వార్ నడుస్తోంది, కానీ నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న భారత్‌ను కూడా ఈ పది దేశాల జాబితాలోకి లాగడం ద్వారా ట్రంప్ నమ్మకద్రోహానికి ఒడిగట్టారని, దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలని నిపుణులు పేర్కొంటున్నారు.






