సీఎస్‌కే కొత్త కోచ్ కు ధోని రెండు కండీషన్లు..?

0
3

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొత్త కోచ్ వేటలో పడింది. గత కొన్ని సీజన్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న సీఎస్‌కే.. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుని, వరుసగా మూడోసారి ప్లేఆఫ్స్‌కు చేరడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలోనే ఆ జట్టుకు దశాబ్ద కాలానికి పైగా హెడ్ కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల తన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో కొత్త కోచ్ ఎంపిక బాధ్యతను మేనేజ్‌మెంట్.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌లపై పెట్టింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. టీమిండియా మాజీ ఆటగాడు హేమంగ్ బదానీ ఈ రేసులో అందరికంటే ముందున్నారు. అయితే, కొత్త కోచ్ ఎంపిక విషయంలో ఎంఎస్ ధోని మేనేజ్‌మెంట్‌కు రెండు అత్యంత కీలకమైన, కఠినమైన షరతులు విధించినట్లు తెలుస్తోంది. అందులో మొదటిది.. సీఎస్‌కే సపోర్ట్ స్టాఫ్ మరియు కోచింగ్ బృందం అంతా కూడా భారతీయుల నాయకత్వంలోనే ఉండాలని ధోని గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ కారణం చేతనే వివిధ విదేశీ లీగ్‌లలో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్న హేమంగ్ బదానీ పేరు ప్రధానంగా పరిశీలనలోకి వచ్చింది.

ఇక రెండో షరతు ప్రకారం.. కొత్తగా వచ్చే హెడ్ కోచ్ కేవలం చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టుకు మాత్రమే ప్రత్యేకంగా పనిచేయాలని, ఇతర లీగ్‌లలో కోచింగ్ బాధ్యతలు తీసుకోకూడదని ధోని స్పష్టం చేశారు. గతంలో ఫ్లెమింగ్ సీఎస్‌కేతో పాటు దక్షిణాఫ్రికా, అమెరికా లీగ్‌లలోని సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలకు కూడా కోచ్‌గా ఉండేవారు. కానీ ఇకపై ఆ పద్ధతికి స్వస్తి పలకాలని, కేవలం ఐపీఎల్ జట్టుపైనే పూర్తి ఫోకస్ పెట్టే కోచ్ కావాలని ధోని సూచించారు. ప్రస్తుతం హేమంగ్ బదానీ ‘ది హండ్రెడ్’ లీగ్‌లో సదరన్ బ్రేవ్ జట్టుకు, ఐఎల్టీ20 లో దుబాయ్ కాపిటల్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ధోని విధించిన షరతుల ప్రకారం సీఎస్‌కే కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలంటే ఆయన ఆయా లీగ్‌ల పదవుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. వచ్చే వారంలోనే ఈ కోచ్ ఎంపికపై సీఎస్‌కే మేనేజ్‌మెంట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.