అరుగు మీద బంతి భోజనం జరుగుతుంటే… గబుక్కున వెళ్లి జనంతోపాటు కూర్చున్నాడు బాలయ్య. వడ్డించారు. తన విస్తర్లోంచి లడ్డూ తీసి… పక్కనున్న అవ్వకు తినిపించాడు కలుపుగోలుగా ! షుగరూ గిగరూ ఏం లేదుగా… అంటూ ఆమె భుజం మీద చేయి వేసి మాట్లాడిన తీరు చూస్తే తెలిసిపోతుంది బాలయ్య అంటే ఏంటో ! ఇదంతా జస్టు ఓ 20 సెకన్ల వీడియో క్లిప్. అంత కల్మషం లేకుండా భోళాగా కనిపించే బాలయ్యలో లోతైన రాజకీయం ఉందా ? అంతకు మించిన వ్యూహం కూడా కనిపిస్తుందా తరచి చూస్తే ? అర్థం చేసుకోడానికి పచ్చ చొక్కాలే వేసుకోనక్కర్లేదు… రవ్వంత ఆలోచన ఉంటే చాలు.
సినిమా పెద్దలం అనుకునే వాళ్లంతా కలిసి తెలంగాణ ప్రభుత్వం దగ్గరకి ఓ మెమొరాండం పట్టుకొని వెళ్లేందుకు రెడీ అయ్యారు. సన్నాహకంగా మీటింగ్ పెట్టారు. చిన్నా పెద్దా అందరినీ పిలిచారు కానీ బాలయ్యను ఆహ్వానించలేదు. పిలవాలని కూడా అనుకోలేదు. తీరా మంత్రి తలసాని దగ్గరకు వెళ్లే రోజున అందరూ మీడియా ముందుకు వచ్చారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి… ఇలా చాలా మందే ఉన్నారు అందులో. బాలయ్య మాట లేదు. అభిమానులు సింపుల్ గా ఒక పని చేశారు సరిగ్గా అదే సమయానికి. ఎన్నికల ప్రచారంలో ఓపెన్ టాప్ జీప్ మీద బాలయ్య చేతులు ఊపుతూ వెళుతుంటే… ఇదే తలసాని జీపు ముందు పరుగు లాంటి నడకతో ఉన్న ఫోటో అది. నో కామెంట్. ఇదీ బాలయ్య రేంజ్ అని ఎవరో రాశారు ఒకే ఒక్క లైన్ లో ! ఆ తర్వాత మూడు నాలుగు నెలలకి మా ఎన్నికలు వచ్చాయ్. చిరంజీవి వర్గం ప్రకాశ్ రాజ్ ను నిలబెట్టింది. అటు పక్కన మోహన్ బాబు కొడుకు. హోరా హోరీ తిట్టుకున్నారు. ఇది చిరు ఇజ్జత్ కా సవాల్ అని చెప్పేందుకు నాగబాబు కూడా మీడియా ముందుకు వచ్చాడు. ఆ తర్వాత బాలయ్యతో ఉన్న ఫోటోను మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఫలితాలు వచ్చాక చూస్తే విష్ణు గెలిచాడు. ధన్యవాదాల మొదటి పేర్లలో బాలయ్య ఉన్నాడు. అంటే అప్పటి బౌన్సర్ కి ఇప్పుడు ఆన్సర్ వచ్చిందన్నమాట. తెలుగు సినిమా అంటేనే మేము అని ఓ వర్గం తోక జాడించాలి అనుకుంటే బాలయ్య కట్ చేసిన తీరు ఇది – అంటారు అభిమానులు. బాలయ్య నిజంగానే ఇంత రాజకీయం చేస్తాడా ? చేయగలడా ?
చూస్తే అలా అనిపించడు. అందుకే బాలయ్యకి తెర మీద తప్ప జీవితంలో నటించడం రాదు అంటారు. కానీ నిర్ణయాలు తీసుకోవడమే రాజకీయం అయితే, టైమింగ్ చూపించడమే స్ట్రాటజీ అనుకుంటే… బాలయ్య మాంఛి స్ట్రాటజీ ఉన్నోడే. ఆహాలో షో చేస్తున్నాడనో, మా ఎన్నికల్లో ఒక్క ఫోటోతో ఫలితాల్ని శాసించాడనో చెప్పడం ఉద్దేశం కాదు. దమ్మున్నోడికి ధైర్యం ఎక్కువ. ధైర్యం ఉన్నోడి నిర్ణయాలకి వేగం ఎక్కువ. మొన్న మధ్య వందో సినిమా ఏం చేస్తాడా అనుకుంటున్నప్పుడు… ఏపీకి కిక్కు ఇచ్చేలా, తెలంగాణ కలిసి వచ్చేలా శాతకర్ణ ఎంచుకున్నాడు. కేవలం రెండు నిమిషాల్లో తీసుకున్న నిర్ణయం అది అంటారు దర్శకుడు క్రిష్. ల్యాండ్ మార్కు సినిమా విషయంలో తేల్చుకోలేక, తోటి వాళ్లంతా తమిళ రీమేకులు చేసి సరిపెట్టుకున్న సమయంలో శాతకర్ణ చరిత్రాత్మక రీతిలో కత్తి దూశాడు. ఇదొక్కటే కాదు.. ముందు నుంచి బాలయ్య స్టైలే ఇంత. ఊరమాస్ పల్లెటూరు కేరెక్టర్లు చేసే రోజుల్లో అల్ట్రామోడ్రన్ ఆదిత్య 369 చేసి… ఆశ్చర్యపరిచే వేరియేషన్లు చూపించాడు. బాలయ్యను అభిమానించని వాళ్లు కూడా కాదనలేని క్లాసిక్ అది. ఆ తర్వాత బాక్సాఫీస్ ను షేకాడించిన మాస్ సినిమాలు తీసినా, ఫ్యాక్షన్ సినిమాలతో ట్రెండు క్రియేట్ చేసినా… పౌరాణికాలతో ఆకట్టుకున్నా అదంతా ఓ ట్రెండ్. జోరు తగ్గింది. ఇక స్లో అవుతున్నాడు అనుకున్న టైమ్ లో మళ్లీ గేరు మార్చాడు.
అంతా సేఫ్ జోన్ కోసం రీమేకులు చూసుకుంటుంటే… బాలయ్య మాత్రం బోయపాటి, రావిపూడి, గోపీచంద్ లాంటి ట్రెండీ డైరెక్టర్లతో లైనప్ రెడీ చేశాడు. బాలయ్య అంటే మాస్ మసాలానే కాదు… ఇది కూడా అని ఈ జనరేషన్ కి చూపించేందుకా అన్నట్టు ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాడు. తెర మీద చించేస్తామని చెప్పుకునే తోటి హీరోలు టీవీల్లో ఓటీటీల్లోకి వచ్చేసరికి బిగుసుకుపోయారు. బడా స్టార్ ని అనుకొనే ఒకాయన అయితే ఓ షో చేసి చేతులు కాల్చుకున్నాడు. వెనక్కి తగ్గాడు. అలాంటిది బాలయ్య కనిపించిన తీరు చూసేవాళ్లకి ఎనర్జిటిక్ గా అనిపిస్తోంది. పైగా టైమింగ్ షాకింగ్ రేంజులో ఉంది. ఆ ప్రోమోలో చెప్పిన డైలాగులు చాలా వరకూ స్క్రిప్టెడ్ కాదు. బాలయ్య స్పాంటెనిటీతో వచ్చినవే. అన్నగారు పెట్టిన పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లడం బాధనిపించలేదా అని మోహన్ బాబు ఫింగరింగ్ చేస్తే… అన్నగారి పార్టీని వదిలి మరో జెండా పట్టుకోవడం నీకు తప్పు అనిపించలేదా అనే డైలాగ్ మాత్రం పీక్సు. ఇవన్నీ ఎవరో చెబితే వచ్చేవి కాదు. టైమింగ్. అంతే !
చిరంజీవవి వర్గం బాలయ్యకి వ్యతిరేకం. ఓపెన్ సీక్రెట్ ఇది. అలాంటి చిరంజీవి బావ మరిది ఆధ్వర్యంలో నడుస్తున్న ఓటీటీలో బాలయ్య షో చేయడం అంటేనే మేజిక్. వ్యక్తిగత విషయాల్నీ సినిమాల్నీ రాజకీయాల్నీ మీరు కలగలిపి చూస్తారేమో, నాకు మాత్రం వేటికవే సెపరేట్ అని బాలయ్య చెబుతున్నట్టుగా ఉంది ఈ నిర్ణయం. క్లారిటీ ఉన్నోడే ఇలాంటి అడుగు వేయగల్గుతాడు. ట్రెండ్ సెట్టర్ అంటే అలాగే ఉంటాడు. మరో మాట. సినిమాల్లో డైలాగులు అదరగొడతాడు. బయట తడబడతాడు అనే ముద్రను కూడా తుడిచి పెట్టేందుకు అన్ స్టాపబుల్ వస్తోందేమో. చూడాలి. పదేళ్లకోసారి మారిపోయే ట్రెండును పట్టుకోవడంలో అందరికంటే ముందున్న బాలయ్య ఇప్పుడు మరో సారి అదే అడుగు వేశాడనిపిస్తోంది. కెరీర్ కు మరో పదేళ్లు పొడిగింపు వచ్చింది అనిపిస్తోంది. అంటే అటు సినిమాల కోణంలో చూసినా, ఇటు రాజకీయమే ఆలోచించినా బాలయ్య అన్ స్టాపబుల్ అని ఈ దీపావళి నిరూపిస్తుందేమో !