28 C
Vijayawada
Wednesday, September 11, 2024
Homeరాజ నీతిఇంఛార్జుల పద్ధతి ఎత్తేయాలా ?

ఇంఛార్జుల పద్ధతి ఎత్తేయాలా ?

బాధ్యతగా ఉండేవాడిని బాధ్యుడు అనొచ్చు కానీ ధీమాగా ఉండే వాడిని ధీరుడు అనడానికి లేదు. కరెక్టే కదా ! టీడీపీలో ఇదే చర్చ ఇంటర్నల్ గా రగులుతోంది. లోపల నుంచి చూసేవాళ్లకి తప్ప బయట వాళ్లకు పెద్దగా అర్థం కాని విషయం ఇది. కానీ, వచ్చే ఎన్నికల్లో ఫలితాల్ని, నంబర్ ను భారీగా ప్రభావితం చేసే పాయింటు ఇదే ! ఇంతకీ బాధ్యతగా ఉండాల్సిన వాళ్లు – ధీమా పెరిగి కాళ్లు పైకెత్తి కూర్చున్నారా ? లేదంటే, గ్రౌండ్ రియాలిటీ వదిలేసి మాకే టిక్కెట్ అని ధీమా ఒలకబోస్తున్నారా ? ఏంటి మేటర్ ? ఇలాంటి ఇంఛార్జుల సిస్టమ్ తో పార్టీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతోంది ?

ప్రతిపక్షంగా నేల మట్టానికి పడిన తర్వాత లేచి నిలబడి గెలవాల్సిన ఎన్నికలు. పైగా జనరేషన్ మారబోతోంది అనే సంకేతాలు అందుతున్న రోజులు. దానికితోడు యువతకు ప్రాధాన్యం ఇస్తాం, ఈసారి అరౌండ్ 40 ఉన్న వాళ్లు వస్తారు చూడండి అంటూ చంద్రబాబు ఆశ పెట్టేశాడు ఆల్రెడీ ! అన్నిటికీ మించి జనంలో ఎలాంటి ఫీలింగు ఉన్నా – అవతలోడి హ్యాండ్లింగ్ ను అస్సలు తక్కువగా అంచనా వేయడానికి లేదు. పైగా కుండ బొచ్చెడు సవాళ్లు ఉన్నాయ్ పార్టీకి ! గతంలో అధికారంలో ఉండగా పక్క పార్టీ నుంచి తెచ్చుకున్న చోట ఇప్పుడు సొంత బలం ఎంత ఉన్నది అనేది పాయింటు ! ఎందుకంటే మమ్మల్ని కాదని వాళ్లని తెస్తావా అంటూ అలిగి లోపలికి వెళ్లిపోయిన వాళ్లు కొందరు. రామసుబ్బారెడ్డి టైపులో ఎదుటి పార్టీలోకి జంప్ కొట్టినవాళ్లు ఇంకొందరు. వచ్చినోళ్లా చాలా చోట్ల నిలవకపాయె ! అందుకే ఎఫెక్ట్ గట్టిగా పడింది. హార్ట్ కోర్ సమర్థకులు కాస్త తట్టుకోండి. ఇది వాస్తవం.

ఇక అంతకు ముందు ఎన్నికల్లో పొత్తు కోసం వదులుకున్న సీట్ల వీక్ నెస్ ఉండనే ఉంది. ఈసారి పొత్తుల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అనే సందేహాలు ఉంటాయ్. దానికితోడు ఓడిపోయాక పక్క పార్టీలోకి వెళ్లిన చోట్ల, పూర్తిగా కాకపోయినా కొద్దో గొప్పో ఎఫెక్ట్ పడింది. ఇన్ని ఉన్నాయ్ లంపటాలు. ఇన్ని ఉన్నా ఏం కాదు, జనం మనవైపు ఉన్నారు – మిషన్ లో మీట గుద్ది గుద్ది పెడతారు లాంటి బోయపాటి సినిమా డైలాగులు కాస్త ఆపుదాం. ఎందుకంటే నడి మధ్యలో ఇంఛార్జుల సిస్టమ్ చించి సీన్ క్రియేట్ చేస్తున్న సందర్భాలు, నియోజక వర్గాలు కనిపిస్తున్నాయ్.
ఎలాగో తెలుసా ? ఆల్రెడీ ఫలానా నియోజక వర్గంలో ఫలానా వ్యక్తి ఇంఛార్జ్ అని పెడతారు. దాదాపుగా ఆయన/ఆమె అక్కడ కేండిడేట్. పైగా చంద్రబాబు మార్క్ కండిషన్లు ఉంటాయ్. ఇంఛార్జ్ అయినంత మాత్రాన టిక్కెట్ గ్యారెంటీ లేదు అని మాట వరసకు చెబుతాడు. మిగతా వాళ్లు నొచ్చుకుంటారేమో అని ! చెప్పినా చెప్పకపోయినా నొచ్చుకునేవాడు ఆల్రెడీ అప్పటికే నొచ్చుకొని ఉంటాడు. టిక్కెట్ వాడికిస్తే నేను ఎందుకు పని చేయాలనేది వాడి పాయింటు. కాదనలేం ! ఎవడి బాధ వాడికి తెలుస్తుంది కదా !

అంటే, మిగతా వాళ్లు పని చేసేందుకు వెనకాడతారు. ఆల్రెడీ ఇంఛార్జ్ అయినవాడు ఖర్చులు భరిస్తున్నా కదా అనే ధీమాతో దిలాసా ఒలకబోస్తాడు. కేడర్ … పైనున్న లీడర్ వైపు చూస్తుంది. ఆయనేమో జిల్లాలకు రోజూ రాలేడు. పంచాయతీ చేయలేడు. ఇదిగో ఇక్కడ గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఆయన కాన్వాయ్ ప్రకాశం వెళ్తుంటే గుంటూరు జిల్లా పొడుగునా వెంట పరిగెత్తుతారు జనం – మద్దతుగా ! కానీ అక్కడున్న నాయకులు పార్టీ కార్యక్రమాలు ఎంత మాత్రం చేస్తున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే ! అంటే జనంలో అభిమానం ఉన్నా, పైనున్న నాయకుడు అనుకున్నా – నడి మధ్యలో ఉన్న సిస్టమ్ నమిలేస్తోంది అనమాట. ఇదే పాయింటు చాలా మందికి తెలుసు. అలాగని నేరుగా ఆయనకి చెబితే ఓ తంటా ! చెప్పకపోతే మరో తంటా !

చెప్పారే అనుకోండి – వీడికి టిక్కెట్ రాదేమో అనే భయంతో చెప్పాడు అనుకోవచ్చు. అవకాశం ఉంది కదా ఇలా అనుకునేందుకు ! ముక్కుసూటిగా మాట్లాడే ఉడుకు రక్తం లీడర్లు కూడా అందుకే బయటపడరు. ఇక ఆల్రెడీ టిక్కెట్ కన్ఫామ్ అయిపోయి, ఎట్టిపరిస్థితుల్లోనూ మరొకరికి ఇచ్చే అవకాశం లేని సీట్లు ఓ 70 ఉండొచ్చు. ఇలాంటి వాళ్లు కూడా నోరుమెదపరు. ఎందుకంటే, మనది మనం చూసుకుందాం, మనం చెబితే మాత్రం మారతుందా ఏంటి పరిస్థితి – అనేది అక్కడ ఆలోచన. ఇక అనుకూల, కుల మీడియా ఎలాగూ రాయదు. చూపదు. ఎందుకంటే ఎదుటోడికి సున్నం కొట్టి – మేం నీకోసం ఇంత చేస్తున్నాం చూశావా అని చంద్రబాబు ముందు ఛాంపియన్ లుక్ ఇవ్వడంలో వాళ్లు బిజీ. ఇలాంటివి చెబితే మోరల్ దెబ్బ తీశారు అంటారని నసుగుతారు లోపలికి పిలిచి అడిగితే ! అందుకే అక్కడా రాదు. వీళ్లూ చెప్పక, వాళ్లూ చూపించక మరి ఎలా ? పరిష్కారం ఏంటి ?

ఇదే పాయింటు ఇప్పుడు. ఇంఛార్జుల సిస్టమ్ ను ఎత్తేయండి. లేదంటే మార్పులు చేయండి. పని చేసే వాళ్లకే టిక్కెట్టు అని చెప్పండి. చివరి వరకూ జనంలో ఉంటూ – వాళ్లతోనే తిరుగుతూ – అవసరమైతే సొంత జేబులో చెయ్యి పెట్టుకోగల వాళ్లు ముందుకొస్తారు. పైగా ఇప్పుడున్న పోటీలో, ఊపులో, జనంలో ఉన్న ఫ్రస్ట్రేషన్ లో టీడీపీ టిక్కెట్లు అమాంతం హాట్ కేకులు అయిపోతాయ్. అభిమానం పరంగానూ ఆర్థికంగానూ పార్టీకి ఊపు ఉత్సాహం పెరుగుతాయ్. ముగ్గురు నలుగురు పోటీలో ఉన్న చోట ఒక్కడికే ఛాన్సు ఉంటుంది. నిజమే ! కానీ గెలిచే పార్టీ కాబట్టి పిలిచి మాట్లాడే సిస్టమ్ పెట్టుకోండి. నీకు ఎమ్మెల్సీ అనో నామినేటెడ్ పోస్టు అనో, ఇంతకు ముందు నానబెట్టి నానబెట్టి నాలుగో ఏడాది వచ్చే వరకూ భర్తీ చేసే వాణ్ని కాదు, ఇప్పుడు అలా ఉండదు – ఆరు నెలలు తిరిగే లోపల అందరికీ పదవులు వస్తాయ్ అని చెప్పండి. ఇందాక చెప్పిన 70 నియోజక వర్గాలు మినహాయించగా, హీనపక్షం పొత్తు లెక్క తీసేయగా, ఇలాంటి నియోజక వర్గాలు ఓ 30, 40 ఉండొచ్చునేమో గట్టిగా ! అంటే హ్యాండిల్ చేయాల్సిన వాళ్లు గట్టిగా వందలోపే ఉంటారు. వచ్చే పదవులు వందల్లో ఉంటే వంద మందిని మెప్పించడం పెద్ద పని అనుకోగలమా ?

అయితే ఇది అనుకున్నంత సులభం కాదు. మోసేవాడికి తెలుస్తుంది నొప్పి. అలాగని అన్నీ మూసుకొని ఇలాగే ఉంటే మిగిలేది పిప్పి. అందుకే పోటీ – వాస్తవాలు – బలాబలాలు – ఎదుటోడి వీక్ నెస్. ఇలా అన్ని కోణాల్లోంచి ఆలోచించి అందరూ అడుగుతున్నది ఒక్కటే మాట ఇంఛార్జి సిస్టమ్ లో మార్పులు ! వీలైతే ఎత్తేయండి – వీలుకాకపోతే మార్చండి… ఇది రైట్ టైమ్ అని ! చూద్దాం ! చంద్రబాబు త్వరలో ఏమైనా మార్పులు ప్రకటిస్తాడో లేదంటే ఇంకో రెండు గంటలు నేనే ఎక్కువ పని చేస్తా అంటూ ఇది కూడా నెత్తినేసుకుంటాడో !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments