41 C
Vijayawada
Wednesday, June 7, 2023
Homeనీతి ప్రత్యేకందటీజ్ భువనేశ్వరి

దటీజ్ భువనేశ్వరి

పెద్దగా డబ్బుల్లేవమ్మా. చిన్న వ్యవసాయ కుటుంబం. చదువుకున్నాం. రాజకీయాల మీద ఆసక్తి. ఏదైనా చేయాలి, సాధించాలన్న కోరిక. స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచే ఆలోచించాం. ఎమ్మెల్యే వరకూ వచ్చేశాం. తర్వాత మంత్రి కూడా అయ్యాం. నేను ఎన్టీఆర్ దృష్టిలో పడ్డాక పెళ్లైంది. మనం నిరంతరం రాజకీయాల్లో ఉంటాం. ఆమె గోల్డెన్ స్ఫూన్ తో పుట్టింది. మనతో పోలిస్తే వేల మెట్లు పైనుంటారు వాళ్లు. ఎలాగా అని మనసులో ఉండేది నాకు. హెరిటేజ్ ఆలోచన చేసింది ఇద్దరం అయినా తీర్చిదిద్దింది పెంచింది ఆమె. నేను ఏం సాధించానో తెలియదు కానీ ఆమె సాధించింది చూస్తే మాత్రం నాకు సంతోషం అనిపిస్తుంది అంటూ సన్నగా నవ్వుతూ చెబుతాడు చంద్రబాబు. అదోరకం ఆనందం కలిసిన గర్వం అది.

ఎన్టీఆర్ నిమ్మకూరులో సైకిల్ మీద తిరిగి కేన్లలో పాలు పోసిన రోజులున్నాయ్. 15 ఏళ్ల వయసులో ! అందుకే పాడిపంటలంటే ఆయనకి ప్రాణం. చెన్నైలో వ్యవసాయ క్షేత్రాలతోపాటు హైద్రాబాద్ రాగానే భారీ స్థాయిలో ఆయన భూములు కొని సాగుచేశాడని కొందరికే తెలుసు. చంద్రబాబు ఆలోచనల్లో అయితే ఓ వ్యాపారవేత్త ఉంటాడు. పావలా పెడితే భవిష్యత్ లో రూపాయి ఎలా అవుతుందో ఆలోచిస్తాడు. రాళ్లు రప్పలున్న ప్రాంతాల్లో వజ్రపుతునక లాంటి నిర్మాణాల్ని తీర్చి, సైబరాబాద్ లను ఆవిష్కరించే ఆలోచనలు అలా వచ్చినవే. ఇటు తండ్రి వారసత్వాన్నీ అటు భర్త ఆలోచనల్ని కలిపి ఓ మహా సామ్రాజ్యాన్ని తీర్చిదిద్దిన నిర్మాత భువనేశ్వరి. వేల కోట్ల టర్నోవర్, లక్షల మందికి ఉపాధి, కోట్లాది మందితో ఆరోగ్యానుబంధం – ఇదే హెరిటేజ్. అక్షరాలా ఆమె కష్టార్జితం.

ఆమె నడిపించేది ఒక్క హెరిటేజ్ ని మాత్రమే కాదు. ఆమె నిలదొక్కుకోబట్టే చంద్రబాబుకి సమయం దొరికింది. ధీమా వచ్చింది. చేయాలనుకున్నది చేసుకుంటూ పోయే వెసులుబాటు సాధ్యమైంది. మనం ఎప్పుడు వాళ్ల కోసం చేసింది తక్కువమ్మా, మన కోసం వాళ్లు చేసిన త్యాగం అయితేనేమీ, ఆలోచన అయితేమీ – అవే మనల్ని నిలబెట్టాయ్. ఆమె లేకపోతే నేను సక్సెస్ అయ్యేవాడిని కాదు. నేను ఒప్పుకుంటా అంటాడు చంద్రబాబు. వాళ్లే అన్నీ చూసుకుంటారు. కొన్ని సార్లు కుటుంబ వేడుకలకి కూడా వెళ్లే తీరిక ఉండేది కాదు. అందరికీ అమె సమాధానం చెప్పి సముదాయించి కాపాడేది అనేప్పుడు చంద్రబాబులో నిజాయితీ కనిపిస్తది. కుటుంబ బాధ్యతల్ని ఓ చేత్తో, వ్యాపారాల్ని మరో చేత్తో సాధిస్తూ… రాష్ట్రానికి చంద్రబాబు లాంటి పరిపాలనా శిఖరాన్ని అందించిన తెగువ భువనేశ్వరి. గత 45 ఏళ్లలో 22 ఏళ్లు అధికారం ఆమె గడప లోపలే ఉంది. అయినా ఎప్పుడూ దర్పంగా కనిపించింది లేదు. దర్జా ఒలకబోయడమూ చూసి ఉండం. ఓ లెజెండ్ కి కూతురు. ఓ దార్శనికుడుకి భార్య. ఓ తిరుగులేని స్టార్ హీరోకి సోదరి. కేంద్రంలో చక్రం తిప్పి శబ్భాష్ అనిపించుకున్న అక్కకు చెల్లెలు. ఎప్పుడైనా తన పొసగని ఫ్రేమ్ లో ఆమె కనిపించగా చూసి ఉండం. నిరాడంబరతే జీవన విధానం అయినప్పుడు ఉండేది ఇలాగే !

చాలా మంది బుర్రలకి తట్టిందో లేదో ఎన్టీఆర్ ని నేటీకీ మనసుల్లో నిలుపుతూ మనతో నడుపుతున్న ఏకైక అధినేత్రి భువనేశ్వరే ! ఏదైనా ప్రమాదం జరిగి కుటుంబాలు అనాధలైతే ఇప్పటికీ ఆదుకునే దిక్కు ఎన్టీఆర్. తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకి పలకాబలపమై తీర్చిదిద్దే అక్షరం ఎన్టీఆర్. బడుగులు ఉద్యోగాల్లో నిలదొక్కుకునే దన్ను ఇచ్చి, జనరేషన్లను నిలబెట్టే వెన్నెముక ఎన్టీఆర్. ఆఖరికి వరదలొచ్చి కడప లాంటి జిల్లాలు కొట్టుకుపోతుంటే సాయమై నిలిచిన అతిపెద్ద దిక్కు ఎన్టీఆర్. ఎస్. ఎన్టీఆర్ ట్రస్ట్. ఆ ట్రస్టును నడిపిస్తున్నది, ఎన్టీఆర్ సేవా స్వరూపానికి నిరంతరం ఊపిరిలా నిలుస్తున్నదీ భువనేశ్వరి. తండ్రి భౌతికంగా లేకపోయినా ఆశయాలు ఎప్పుడూ అమరం, అజరామరం అని నిరూపిస్తున్న తెలుగు వెలుగు భువనేశ్వరి. సేవాసౌభాగ్యంతో ప్రతీ తెలుగింటికీ ఆడపడుచు అయ్యింది ఆమె.

గ్రూప్స్ , సివిల్స్ లాంటి పరీక్షల కోసం లక్షల మందికి మీరు శిక్షణ ఇప్పించి ఉంటారు. హెరిటేజ్ లో వేల కుటుంబాలు భాగస్వామ్యమై ఉండి ఉంటాయ్. ఆంద్రాతో సరిసమానంగా అంతకంటే ఎక్కువగా తెలంగాణలో ట్రస్ట్ కార్యకలాపాలు జరుగుతాయ్… మీరు ప్రచారానికి ఒక్క రోజు రండి మాకు హెల్ప్ అవుతుంది అని అడిగారు కొంతమంది పోయిన ఎన్నికల్లో ! నేను నాన్నగారి సేవా ఆశయం కోసం పనిచేస్తున్నాను అండీ, రాజకీయాలతో సంబంధం లేనిదే సేవ అని నేను నమ్ముతా – అని ఆమె సమాధానం చెప్పినప్పుడు, నేను లేకపోయినా నే చేసిన పనులు ఉంటాయ్ ఎప్పటికీ అన్న ఎన్టీఆర్ మాటలు గుర్తొచ్చాయ్. ఐదేళ్ల అవకాశం దక్కిన పాపానికి పక్క రాష్ట్రాల్లో కూడా రాజకీయ లబ్ది కోసం జోలెపట్టి పాకులాడే మహిళామణులను చూస్తున్న వాళ్లకి, నిజానికి భువనేశ్వరి మహామనిషీ !

అమ్మ అయినా సొంత బిడ్డలనే సాకుతుంది. ఎంత సోదరైనా సొంత తోబుట్టువలకే అభిమానం పంచుకుంది. కూతురే అయినా నా వాళ్లు అని స్వార్థం చూసుకుంటుంది. ప్రాంతాలకీ, బంధాలకీ అతీతంగా, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుంండా జగమంత కుటుంబం నాదీ – అనే స్ఫూర్తిని చేతల్లో చూపే భువనేశ్వరి ప్రతీ తెలుగింటి దీపం. ఆమెను అనరాని మాట అనడం అంటే అమ్మను అవమానించినట్టే. సోదరిని కించపరిచినట్టే. అన్నిటికీ మించి – నేను మనిషి జన్మఎత్తలేదు అని వాడంతట వాడుగా ప్రకటించుకున్నట్టే. అలాంటి గుంపు అడవిలో ఉంటే మృగాలంటాం. మరి సమాజంలో ఉంటే ఏమనాలో మనమే తేల్చుకుందాం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments