మాట నిలబెట్టుకుంటావా జగన్..?

0
11

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలు.. ఆ పార్టీలోనే పెద్ద వ్యూహాత్మక తప్పిదంగా మారబోతున్నాయనే చర్చ నడుస్తోంది. స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థులకు తలవొగ్గి ఏకగ్రీవాలకు తావిస్తే.. సదరు నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లు, సీనియర్ నేతలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదంటూ జగన్ ఇప్పటికే బహిరంగంగానే హెచ్చరించారు. అయితే క్షేత్రస్థాయి గ్రౌండ్ రియాలిటీ భిన్నంగా ఉండటం, ఇప్పటికే పలు కీలక స్థానాలు తెలుగుదేశం-కూటమి వైపు ఏకగ్రీవం అయ్యే దిశగా అడుగులు పడటంతో ఈ నిర్ణయం వైసీపీ సీనియర్ల మెడకు ఉరితాడులా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కూటమి హవా ముందు నిలవలేక ఇప్పటికే కీలక స్థానాలు ఏకగ్రీవాలు అవుతున్న తరుణంలో, జగన్ పెట్టిన ఈ కండిషన్స్ సొంత పార్టీ నేతల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గట్టి పట్టున్న పుంగనూరు నియోజకవర్గంలో కూటమి జోరు పెరగడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇరకాటంలో పడ్డారు. చివరకు పోటీ నుంచి తప్పుకున్నారు. అలాగే దర్శిలో కూటమి ఏకగ్రీవ వ్యూహాల ముందు నిలవలేక బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి కూడా తప్పుకోవడం సంచలనం అయింది.

పల్నాడులో కీలక నియోజకవర్గం గురజాలలో కూటమి ఆధిక్యతతో కాసు మహేష్ రెడ్డికి, రాయచోటిలో కోట కుప్పకూలేలా కూటమి పావులు కదపడంతో గడికోట శ్రీకాంత్ రెడ్డికి తదుపరి ఎన్నికల భయం పట్టుకుంది. కడప జిల్లాలోనే కూటమి హవా నడుస్తుండటంతో కమలాపురంలో పోచింరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి భవిష్యత్తు కూడా నీలినీడల్లో పడింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రాష్ట్రంలో తెలుగుదేశం-కూటమి అనుకూల గాలి స్పష్టంగా వీస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తదుపరి క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్ పూర్తిస్థాయి బలంతో ఉంది.

ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక, వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. పలు చోట్ల ఇప్పటికే ఏకగ్రీవాలు ఖరారవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి క్షేత్రస్థాయి వాస్తవాలను గమనించకుండా మడమ తిప్పను అంటూ సీనియర్ నేతలను భయపెట్టేలా 2029 టికెట్లపై ఆంక్షలు విధించడం హాస్యాస్పదంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.

జగన్ హెచ్చరికల వల్ల నేతల్లో జోష్ పెరగడం పక్కన పెడితే.. ఇప్పటికే పెద్దిరెడ్డి, గడికోట వంటి అగ్రనేతలు తమ స్వయంకృతాపరాధం కాకపోయినా రాబోయే ఎన్నికల్లో టికెట్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. టీడీపీ వ్యూహాత్మక దూకుడుకు బ్రేకులు వేయలేక, ఇటు అధినేత కఠిన నిర్ణయాల మధ్య నలిగిపోతూ వైసీపీ సీనియర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని, ఇది అంతిమంగా కూటమికే పూర్తి రాజకీయ ప్రయోజనాన్ని చేకూరుస్తుందని స్పష్టమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.