గురజాల క్లీన్ స్వీప్‌ వెనుక అసలేం జరిగింది..?

0
9

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. పల్నాడు జిల్లాలోని అత్యంత కీలకమైన గురజాల మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కటంటే ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఈ పురపాలిక కూటమి వశం కావడం దాదాపు ఖాయమైపోయింది. అయితే, ఎప్పుడూ రాజకీయంగా అత్యంత వేడిగా ఉండే గురజాలలో అసలేం జరిగింది..? ప్రధాన ప్రతిపక్షం ఎందుకు చాపచుట్టేసింది..?

మున్సిపల్ ఎన్నికల పోరుకు వైసీపీ అధిష్ఠానం గురజాల నగర పంచాయతీ ఛైర్మన్ అభ్యర్థిగా పోలు వీరారెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. అయితే నామినేషన్లు వేయాల్సిన చివరి రోజుల్లో క్షేత్రస్థాయిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నామినేషన్ పత్రాలు సమర్పించాల్సిన సమయంలో వైసీపీ అభ్యర్థులను పోలీసులు, కూటమి శ్రేణులు అడ్డుకున్నారని ఆ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా ఛైర్మన్ అభ్యర్థి పోలు వీరారెడ్డితో పాటు నియోజకవర్గ ముఖ్య నేతలు యనుమల మురళీధర్ రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు వంటి వారిని పోలీసులు ముందే పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, ఆ తర్వాత అక్రమంగా నిర్బంధించారని వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

తమ అభ్యర్థులు నామినేషన్ కేంద్రానికి వెళ్లకుండా రహదారుల వెంట భారీగా మోహరించి అడ్డుకున్నారని, దీనివల్ల కౌన్సిలర్ స్థానాలకు కూడా నామినేషన్లు వేయడం సాధ్యపడలేదని తాడేపల్లి కార్యాలయం అధికారికంగా ప్రకటనలు జారీ చేసింది. అయితే.. గత సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు రీజియన్‌లో టీడీపీ స్పష్టమైన ప్రభంజనాన్ని కనబరిచింది. ఈ దెబ్బతో స్థానికంగా వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. గురజాలలో కూటమి అభ్యర్థుల దూకుడు, ప్రజల మద్దతు ముందు తాము డిపాజిట్లు కూడా దక్కించుకోలేమని ముందే గ్రహించిన వైసీపీ నేతలు, చివరి నిమిషంలో పోటీ నుంచి వైదొలిగారనే ప్రచారం కూడా సాగుతోంది.

దీనికి తోడు దర్శి, పిడుగురాళ్ల వంటి చోట్ల వైసీపీ అభ్యర్థులు సమయపాలన పాటించకపోవడం, 20 నిమిషాలు ఆలస్యంగా రావడం వంటి సాంకేతిక లోపాల వల్లే నామినేషన్లు వేయలేకపోయారని, కేవలం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పోలీసులపై నిందలు వేస్తున్నారని కూటమి నేతలు తిప్పికొడుతున్నారు. కేవలం గురజాల మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. పుంగనూరు, రాయచోటి వంటి చోట్ల కూడా వైసీపీ అభ్యర్థులు ఒక్క నామినేషన్ కూడా వేయలేక చేతులెత్తేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.