“కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక చట్టసవరణకు మద్దతు ఇచ్చి తప్పు చేశాము. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాము. పాత చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్లను నియమించే త్రీమెన్ కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత సభ్యులుగా వుండేవారు. ఆ చట్టాన్ని మార్చి సుప్రీం కోర్టు న్యాయమూర్తిని తొలగించి ఆ ప్లేస్ లో కేంద్రమంత్రిని చేర్చారు. దీని వల్ల కేంద్రం అనుకున్నవాల్లే సిఈసీలు అవుతున్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే అవకాశం లేదు. పాత చట్టం ప్రకారం ఎంపిక జరిగితే ఎన్నికల సంఘం మీద, ఎన్నికల ప్రక్రియ మీద నమ్మకం కలుగుతుందన్నారు. ప్రస్తుత ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట మీద మాకు నమ్మకం లేదు. అతను కరడు గట్టిన చంద్రబాబు విధేయడు” ఇది వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత వాదనలకు, ఆయన గతంలో తీసుకున్న నిర్ణయాలకు మధ్య స్పష్టత అవసరం. ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. అప్పుడు చట్టసవరణకు మద్దతిచ్చి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC), రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) నియామకాలు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల ఆధిపత్యంలో కాకుండా, ఒక తటస్థమైన, స్వతంత్ర వ్యవస్థ ద్వారా జరగాలని జగన్ ఇప్పుడు చెబుతున్నాడు. 2023లో ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్ట సవరణకు ఆయన పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ చట్టం ప్రకారం ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర కేబినెట్ మంత్రి ఉంటారు. ఇప్పుడు మాత్రం ఈ విధానాన్ని మార్చాలని జగన్ కోరుతున్నాడు.
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామాలను కూడా గుర్తు చేసుకోవాలి. 2020లో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానిక ఎన్నికల సమయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గలేదని జగన్ ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు. కమ్మ కులస్థుడని కులం పేరుతో దూషించారు. ఎన్నికల కమిషనర్ పదవీకాలం, అర్హతలకు సంబంధించిన నిబంధనలను మార్చి రమేష్ కుమార్ ని పదవి నుంచి తొలగించారు. అనంతరం మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, కురు వ్రుద్ధుడైన జస్టిస్ వి. కనగరాజ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు.
ఆగమేఘాల మీద ఆయన్ని మద్రాసు నుంచి రప్పించారు. అయితే జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పు పట్టింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగించేందుకు తీసుకున్న చర్యలను కొట్టివేసింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగించి, తమకు నచ్చిన వ్యక్తిని నియమించడానికే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. 77 ఏళ్ల వయసున్న, 15 ఏళ్ల క్రితమే మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి సూచన మేరకు నియమించడం రాజ్యాంగ నైతికతకు విరుద్ధమని తీర్పులో వ్యాఖ్యానించింది. అప్పుడలా చేసి..
ఇప్పుడు తనకు నొప్పి తెలిసొచ్చి ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రభుత్వాల పాత్ర వుండకూడదని వాపోతున్నాడు. తను అడ్డగోలుగా కమిషనర్ని మార్చిన విషయం మరచిపోయి ఇప్పుడు సూక్తులు చెప్తున్నారు. అదీ మంచిదే కానీ కొన్ని ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రభుత్వాల జోక్యం తప్పని ఇప్పుడు భావిస్తే, తన ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను మార్చడానికి ఎందుకు చర్యలు తీసుకున్నారు..?
ఎన్నికల కమిషనర్ల నియామకానికి తటస్థమైన వ్యవస్థ అవసరమైతే, 2023 నియామక చట్టానికి ఎందుకు మద్దతిచ్చారు? అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా వ్యవహరించడం వెనుక ఉన్న కారణాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత లేదా? ఎన్నికల కమిషన్ స్వతంత్రత అనేది అధికారంలో ఉన్న పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి వేర్వేరుగా వర్తించే సూత్రం కాదు. అది ప్రజాస్వామ్యానికి సంబంధించిన మౌలిక సూత్రం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎన్నికల సంస్థల నియామకాల్లో పారదర్శకత, నిష్పాక్షికత, స్వతంత్రత ఉండాలి. తాను అధికారంలో వున్నప్పుడు తను చెప్పినట్టు వినాలని శాసించి, అధికారం పోయాక రాజ్యాంగ విలువలు, ఎన్నికల కమిషనర్ల నిష్పాక్షిత గురించి మాట్లాడ్డం హాస్యాస్పదంగా వుంది. రమేష్ కుమార్‌ని తొలగించి కనగరాజ్ ని ఆగమేఘాల మీద తీసుకొచ్చిన జగన్ అలా ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో ఏపీ ప్రజలకు వివరణ ఇవ్వాలి.














