వాళ్లను సస్పెండ్ చేస్తా.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

0
6

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి శ్రేణులను సమాయత్తం చేస్తూ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలతో కీలక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే పల్లె సమరంలో విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులకు, క్షేత్రస్థాయి శ్రేణులకు ఆయన స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు బలమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు.

ఎన్నికల ప్రక్రియలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని, మిత్రధర్మాన్ని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. స్థానిక స్థాయిలో ఎలాంటి మనస్పర్థలకు తావులేకుండా, కూటమి తరఫున అధికారికంగా బరిలో నిలిచే అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆదేశించారు. పార్టీ నిర్ణయాన్ని దిక్కరించి రెబల్స్‌గా నామినేషన్లు వేసిన వారిపై చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.

రెబల్ అభ్యర్థులతో సీనియర్ నేతలు వెంటనే మాట్లాడి, వారితో నామినేషన్లను ఉపసంహరింపజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలా కాదని పార్టీ ఆదేశాలను తుంగలో తొక్కి పోటీలో నిలిస్తే, ఎంతటి వారైనా సరే తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కఠిన హెచ్చరికలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేరుస్తున్నామో వివరించేలా ‘చెప్పాం.. చేస్తున్నాం’ అనే నినాదంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు. చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి స్థానిక పోరులో కూటమి విజయకేతనం ఎగరేసేలా శ్రేణులు సన్నద్ధం కావాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.