విజయనగరం రాజకీయాలను దశాబ్దాలుగా శాసించిన సీనియర్ నేత బొత్సా సత్యనారాయణకు ఈ స్థానిక ఎన్నికలు సవాల్ గా మారాయి. బొత్స ఏ పార్టీలో వున్నా విజయనగరం జిల్లాలో ఎన్నికొలొచ్చాయంటే బొత్స, ఆయన బంధుగణం హడావుడి మామూలుగా ఉండదు. ఎన్నికలంటే నల్లేరు మీద నడకే అన్నట్టుగా బొత్స రాజకీయం చేస్తారు. కానీ ఈసారి బొమ్మ తిరగబడింది. ఉనికి కోసం, పరువు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా మొత్తం ఒకెత్తయితే.. గజపతినగరం నియోజకవర్గం పరిధిలోని “బొండపల్లి జెడ్పీటీసీ” స్థానం అందర్నీ ఆకర్షిస్తోంది. కారణం.. ఇక్కడ బొత్సా కుమార్తె డాక్టర్ బొత్స అనూష వైఎస్సార్‌సీపీ తరఫున బరిలోకి దిగారు. అనూష జడ్పీ చైర్మన్ రేసులో వున్నారు. అనూష మీద తెలుగుదేశం పార్టీ ఎలాంటిరాజకీయ నేపథ్యం లేని సాధారణ మధ్యతరగతి విద్యావంతురాలిని పోటీకి దించింది. అనూష గెలుపుని బొత్స ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తేడా వస్తే తన ఆధిపత్యం, పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి కాబట్టి కూతురి గెలుపు కోసం ఒక సామాన్య అభ్యర్థి మీద సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
ఇంత గడ్డు పరిస్థితికి కారణం మజ్జి శ్రీను అలియాస్ చిన్న శ్రీను. బొత్సాకు అత్యంత నమ్మకస్తుడు, రైట్ హ్యాండ్, దగ్గరి బంధువైన మజ్జి శ్రీను వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపోవడం జిల్లా రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. చిన్న శ్రీను ఎగ్జిట్ తర్వాత క్షేత్రస్థాయిలో బొత్సా సత్యనారాయణకు జిల్లాలో తనకంటూ ఒక బలమైన వర్గమే లేకుండా పోయింది. క్యాడర్, ద్వితీయ శ్రేణి నాయకత్వం చిన్న శ్రీను వైపునకు మళ్లడంతో బొత్సా వర్గం పూర్తిగా బలహీనపడింది. ఈ తీవ్ర సంక్షోభ సమయంలో జిల్లాపై పట్టు నిలుపుకోవడానికి, పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి బొత్సా తన కుటుంబ సభ్యులనే నేరుగా రంగంలోకి దించాల్సి వచ్చింది.
జిల్లాలో స్థానిక నేతల మీద నమ్మకం లేక, బొత్సా తన కుటుంబం నుంచి ఏకంగా నలుగురిని జెడ్పీటీసీ రేసులోకి తెచ్చారు. కుమార్తె అనూషను బొండపల్లిలో, కోడలు పూజితను గరివిడిలో, సోదరి వెంకటలక్ష్మిని గుర్లలో, సోదరుడి కుమారుడు చైతన్యను పూసపాటిరేగలో నామినేషన్లు వేయించారు. జెడ్పీ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా బొత్సా ఈ స్కెచ్ వేసినప్పటికీ.. జిల్లా వ్యాప్తంగా కళ్లన్నీ ఇప్పుడు బొండపల్లి జెడ్పీటీసీ స్థానంపైనే కేంద్రీకృతమయ్యాయి. ఎందుకంటే ఇక్కడి నుంచే బొత్సా తన రాజకీయ వారసురాలిగా, కూతురు డాక్టర్ అనూషను గెలిపించి జెడ్పీ చైర్‌పర్సన్ పీఠం ఎక్కించాలని పట్టుదలతో ఉన్నారు.
ఇక్కడ బొత్సా కుమార్తె అనూషపై కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్థిగా పాశాల నీరజ బరిలో నిలిచారు. నీరజకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు, ఆమె సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మహిళ. ప్రత్యర్థి సాధారణ మహిళ అయినప్పటికీ.. కూతురు అనూషను ఎలాగైనా గెలిపించితీరాలనే పట్టుదలతో బొత్సా తనకున్న సర్వశక్తులను, అంగ బలాన్ని, అర్థ బలాన్ని బొండపల్లి మండలంలో రంగంలోకి దించారు. ప్రత్యర్థిని ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా, భారీ వ్యూహాలతో బొత్సా సామ్రాజ్యం ఇక్కడ మోహరించింది.బొండపల్లిలో స్థానిక క్యాడర్ లో నమ్మకం లేకపోవడంతో, బొత్సా తన తమ్ముడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే అయిన బొత్సా అప్పలనరసయ్యకు బాధ్యతలు అప్పగించారు. దీనికోసం కేవలం స్థానిక నాయకులను నమ్ముకోకుండా.. పక్కనే ఉన్న చీపురుపల్లి, ఇతర మండలాల నుంచి భారీగా తమ నమ్మకస్థులైన ప్రధాన అనుచరులను దించి అనూష కోసం ప్రచారం చేయిస్తున్నారు.
ఈ ఎన్నిక కేవలం ఒక జెడ్పీటీసీ స్థానం గెలుపు కోసమే కాదు.. ఇది బొత్సా సత్యనారాయణ రాజకీయ భవిష్యత్తును, ఆయన పరువును శాసించే ఎన్నిక. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర బొత్సాకు ఉన్న పట్టు, విలువ ఈ ఫలితంపైనే ఆధారపడి ఉన్నాయి. సొంత జిల్లాలో మేనల్లుడిని ఆపుకోలేకపోయారు, ఇప్పుడు కనీసం తన స్వంత కుమార్తెను కూడా గెలిపించుకోలేకపోతే.. జగన్ దగ్గర బొత్సా మాట చెల్లుబాటు కాకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే, బొండపల్లిలో కుమార్తె గెలుపు కోసం చెమటోడ్చుతున్నారు. ఈ హై-ప్రొఫైల్ పోరులో బొండపల్లి ప్రజలు బొత్సా వారసత్వానికి జై కొడతారా..? లేక కూటమి వైపు నిలుస్తారా..? అనేది తేలాల్సి ఉంది.






