గొడ్డలి పార్టీకి అభివృద్ధి నచ్చదు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

0
2

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని ప్రతిపక్ష గొడ్డలి పార్టీ ఏమాత్రం సహించలేకపోతోందని మండిపడ్డారు. కేవలం అసత్య ప్రచారాలు చేయడమే ఆ పార్టీ దినచర్యగా పెట్టుకుందని, అభివృద్ధిని అడ్డుకోవడమే వారి ఏకైక ఎజెండా అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం గొడ్డలి పార్టీకి అస్సలు ఇష్టం లేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికలు జరగకూడదనే కుట్రతో క్షేత్రస్థాయిలో వారు అనేక విధ్వంసాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం తాము కల్పించిన రిజర్వేషన్లను సైతం అడ్డుకునేందుకు ఈ గొడ్డలి పార్టీ కోర్టులకెళ్లిందని ధ్వజమెత్తారు. “ఆ పార్టీ నాయకుడు రెండు రోజులు ఇక్కడకు వచ్చి అబద్ధాలన్నీ చెప్పి.. మళ్లీ బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్తారు” అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు ఘాటుగా ఎద్దేవా చేశారు.

తాము పెత్తందారులం కాదని, ప్రజలకు కేవలం సేవకులం మాత్రమేనని స్పష్టం చేసిన సీఎం.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఇదే తరుణంలో రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు సరికొత్త పొలిటికల్ స్లోగన్‌ను ప్రజల ముందుకు తెచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కలయికతో ‘డబుల్ ఇంజిన్ సర్కారు’ నడుస్తోందని.. అయితే అభివృద్ధి మరింత వేగవంతం కావడానికి ప్రజలు తమకు ‘ట్రిపుల్ ఇంజిన్ సర్కారు’ను అందించాలని పిలుపునిచ్చారు.

కేంద్రం, రాష్ట్రంతో పాటు స్థానిక సంస్థల్లో కూడా కూటమి ప్రభుత్వమే ఉంటే కేంద్ర నిధులు నేరుగా గ్రామాలకు అంది, ప్రగతి వేగం మునుపెన్నడూ లేనంతగా పెరుగుతుందన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవానికి అందాలని, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నదే తమ ఆశయమని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఓటు వేసే ముందు మంచి, చెడులను విశ్లేషించి, ఎవరు న్యాయం చేస్తారో ఆలోచించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు ఓటర్లను కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.