తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పదవీకాలం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయ పరిపాలనా వ్యవహారాల నిర్వహణ కోసం ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని రంగంలోకి దించింది. ఈ ప్రత్యేక అధికారుల కమిటీ ఛైర్మన్‌గా టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రమాణస్వీకారం చేశారు.
రాజకీయ సమీకరణాలు లేదా ఇతర పరిపాలనాపరమైన కారణాల వల్ల సాధారణంగా కొత్త బోర్డు ఏర్పాటు ఆలస్యమైనప్పుడు ప్రభుత్వం ఈ తరహా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం, ఈ స్పెసిఫైడ్ అథారిటీలో కేవలం ముగ్గురు ఉన్నతాధికారులకు మాత్రమే చోటు కల్పించారు. ఛైర్మన్‌గా ఈఓ ముద్దాడ రవిచంద్ర వ్యవహరించనుండగా, సభ్యులుగా ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
పూర్తి స్థాయి రాజకీయ లేదా సాధారణ పాలకమండలి లేని కారణంగా, రాబోయే కొన్ని నెలల పాటు తిరుమల శ్రీవారి ఆలయ పర్యవేక్షణ, భక్తుల వసతులు, లడ్డూ ప్రసాదం మరియు అత్యవసర నిర్ణయాలన్నీ ఐఏఎస్ అధికారులతో కూడిన ఈ ముగ్గురు సభ్యుల కమిటీనే తీసుకోనుంది. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు లేదా కొత్త ధర్మకర్తల మండలిని అధికారికంగా ప్రకటించేంత వరకు ఈ ఐఏఎస్ అధికారుల పాలనే సాగనుంది. దీని బట్టి చూస్తే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఇప్పట్లో టీటీడీ బోర్డు ఏర్పాటు అయ్యే అవకాశం కనపడటం లేదు. ఆశావాహుల సంఖ్య భారీగా ఉండటం, రాజకీయంగా ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల హడావుడి ఈ పరిణామాలతో బోర్డు ఏర్పాటును కూటమి సర్కార్ వాయిదా వేసే అవకాశం కనపడుతోంది.














