ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిషత్ ఎన్నికల పోలింగ్ వేళ తిరుమల జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఊహించని రీతిలో హై-వోల్టేజ్ పొలిటికల్ డ్రామా నడిచింది. క్షేత్రస్థాయిలో చాలా మంది సీనియర్ పురుష నాయకులు కూడా చూపించలేకపోయిన అసాధారణ ధైర్యాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ప్రదర్శించి వార్తల్లో నిలిచారు. వైసీపీ అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉండి, నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ పట్టున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆమె ఒంటరిగా ఎదుర్కొన్న తీరు, అడ్డుకున్న పద్ధతి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తిరుపతి రూరల్ పరిధిలోని మంగళంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రశాంతంగా పోలింగ్ జరగకుండా అక్రమాలకు తావునిచ్చేలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలింగ్ బూత్‌ల వద్ద తిరుగుతున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. దీంతో ఏమాత్రం బెదరకుండా నేరుగా రంగంలోకి దిగిన సుధారెడ్డి.. చెవిరెడ్డిని ముఖాముఖి నిలదీశారు. “చెవిరెడ్డి అన్న ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వెళ్తాను.. అవసరమైతే ఇద్దరం ఒకే కారులో కూర్చుని అన్ని బూత్‌లు తిరుగుదాం, అన్నకు ఒక కుర్చీ వేయండి” అంటూ ఆయన్ను అంగుళం కూడా కదలకుండా వెన్నంటి వెంబడించడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
సుధారెడ్డి చూపించిన ఈ వ్యూహాత్మక చొరవతో చెవిరెడ్డి సైతం తీవ్ర అసహనానికి, కంగుతినే పరిస్థితికి లోనై సైలెంట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటనపై రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన కోణాన్ని లేవనెత్తుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో స్థానిక ఎన్నికల నిర్వహణ వేళ చాలా చోట్ల టీడీపీ లీడర్లు రక్షణాత్మక ధోరణిలో ఉండిపోయారు. కానీ, చంద్రగిరి లాంటి అత్యంత సున్నితమైన, ప్రత్యర్థి వర్గం బలంగా ఉన్న అడ్డాలో ఒక మహిళా నాయకురాలై ఉండి కూడా సుధారెడ్డి చూపించిన తెగింపు..
మిగతా నియోజకవర్గాల నేతలకు ఒక పాఠం లాంటిదని కేడర్ చర్చించుకుంటోంది. కేవలం పోలీస్ యంత్రాంగంపైనే భారం వేయకుండా, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడానికి లీడర్లకు గ్రౌండ్ లెవెల్లో ఎంతటి గుండెధైర్యం ఉండాలో సుధారెడ్డి నిరూపించారని, ఈ తరహా పోరాట పటిమ చూపిస్తేనే క్షేత్రస్థాయిలో పార్టీకి తిరుగుండదని టీడీపీ కార్యకర్తలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.














