పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గ పరిధిలో వరద ముప్పు తీవ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహానికి తోడు, స్థానికంగా కురుస్తున్న వర్షాల కారణంగా యనమదుర్రు డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. డ్రెయిన్ పరివాహక ప్రాంతాల్లో నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యనమదుర్రు డ్రెయిన్ ఉధృతి నేపథ్యంలో భీమవరం పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరే ప్రమాదం పొంచివుంది.
దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని సూచించారు. మరోవైపు పాలకోడేరు మండల పరిధిలో గోస్తనీ నది ఉగ్రరూపం దాల్చింది. నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో పరివాహక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడింది.
వరద ఉధృతికి పాలకోడేరులోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి భారీగా నీరు వచ్చి చేరింది. సబ్‌స్టేషన్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వరద తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.














