విజయనగరం జిల్లాలో వైసిపి నుంచి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడిన గంటల్లోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అప్పలనాయుడు ఇటీవల తెలుగుదేశంలో చేరిన మజ్జి శ్రీనుకు బావ, వియ్యంకుడు కూడా. రాజీనామా సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్న శ్రీను టిడిపిలో చేరడానికి గల కారణాలతో పాటు ఆ తరువాత జరిగిన పరిణామాలు వివరించారు. చిన్న శ్రీనుని విజయనగరం జిల్లా నుంచి జగన్ తప్పించాడని, అయితే భీమిలి లేదా ఎచ్చెర్ల వెళ్లమని ఆదేశించాడని చెప్పారు.
శ్రీను తెలుగుదేశంలో చేరిన తరువాత తాను పార్టీలోనే వుంటానని స్పష్టంగా చెప్పినా తనను ఇన్చార్జి పదవి నుంచి తప్పించారు, అంతటితో ఆగకుండా సస్పెండ్ చేశారన్నారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానని ఆరోపించారు. కానీ దానికి ఆధారాలు మాత్రం చూపలేదు. అసలు పార్టీలో క్రమశిక్షణ సంఘం ఎక్కడుంది..? అంతా జగన్ అభీష్టం మేరకు నడిచే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని, జగన్ ఒక నియంత అని, 2029లో అధికారంలోకి వస్తామని చెప్పడం సంధి ప్రేలాపనలే అని విమర్శించారు. తాను మజ్జి శ్రీనుకు బంధువునని సస్పెండ్ చేసినప్పుడు, మరి బొత్స సత్యనారాయయణ కూడా బంధువే.
ఆయన్నెందుకు సస్పెండ్ చెయ్యలేదు.. ? బంధుత్వానికి రాజకీయానికి సంబంధం ఉంది అనుకుంటే జగన్ చెల్లెలు పిసిసి అధ్యక్షురాలుగా ఉంది. దీనికి జగన్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. నాయకులు పార్టీని వీడినప్పుడు అధిష్టానం మీద విమర్శలు చెయ్యడం సహజమే. వైసిపి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ఆయన పార్టీలో కొనసాగినప్పుడు తెలియదా..? ఆ మాటకొస్తే ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లాంటివే. అధినేత డెసిషనే ఫైనల్. బంధుత్వానికి సంబంధించి ఆయన లేవనెత్తని ప్రశ్నలు ఆలోచించదగినవి. బంధుత్వాలకు రాజకీయాలకు సంబంధం అంటగడితే చాలా మంది రాజకీయాలు మానుకోవాలి.
మజ్జి శ్రీనుకు బొత్స బంధువే.. మరి ఆయన్ను కూడా సస్పెండ్ చెయ్యాలి.. శ్రీకాకుళంలో కూన రవికుమార్ మాజీ స్పీకర్, వైసిపి నేత తమ్మినేని సీతారాం కు బంధువే. సీతారామ్ ని కూడా సస్పెండ్ చెయ్యాలి. అప్పలనాయుడు చెప్పినట్టు సాక్షాత్తు అధినేత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ లో వున్నారు. దానికి సమాధానం చెప్పు జగన్ అంటే ఏం చెప్తారు? మజ్జి శ్రీను పార్టీ నుంచి వెళ్లిపోయాక అప్పలనాయుడుని కూడా పంపించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ననెల్లిమర్ల లో పార్టీకి నష్టం జరుగుతుందని బొత్స చెప్పినా, సజ్జల చెప్పినా, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కన్నబాబు చెప్పినా ఆయన వినిపించుకోలేదు.
మజ్జి శ్రీను దెబ్బకే విలవిల్లాడుతున్న బొత్స ఇప్పుడు అప్పలనాయుడు దాడిని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బొత్స ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి, ఆయన తమ్ముడు ప్రాతినిధ్యం వహించిన గజపతినగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో వైసిపి కోలుకోవడం కష్టమే అంటున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో వైసిపిని దెబ్బకొట్టేందుకు మజ్జి శ్రీను వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే చీపురుపల్లి, నెల్లిమర్లనియోజకవర్గాల్లో చాలా మంది వైసిపి నేతలు పచ్చ కండువాలు కప్పుకున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనడం బొత్స సోదరులకు కష్టమే.
మజ్జి శ్రీను ప్రభావం జిల్లాలో కొంతమేర వున్నా, ఈ మూడు నియోజకవర్గాల్లో వైసిపి ఇక కోలుకోలేదని పరిశీలకుల భావన. మజ్జి శ్రీనుని ఎదుర్కొని తన ప్రాభవాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలన్నా, వైసిపి జెండాని ఎగరెయ్యాలన్నా బొత్సకు కష్టమే. మునపటిలాగా వయసు లేదు, ఆరోగ్యం సహకరించదు. అధికారం లేదు.. కుడి భుజంగా వుంటూ, క్యాడర్ తో నిత్య సంబంధాలుండే మజ్జి శ్రీను లేడు. అసెంబ్లీ ఎన్నికల వరకు తన వర్గాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టమేనని, అసలు రేపు జరగబోయే స్థానిక ఎన్నికల నాటికే వైసిపి ఖాళీ అవ్వొచ్చంటున్నారు. జిల్లాలో ఇక బొత్స రాజకీయానికి, బొత్స ఆధిపత్యానికి శుభం కార్డు పడినట్టే.














