భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా జేర్సీతో అంతర్జాతీయ క్రికెట్లోకి అదిరిపోయే పునరాగమనం చేశాడు. గాయపడిన అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20కి ఎంపికైనప్పటికీ ఆ మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆయనకు బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ఆధునిక టీ20 క్రికెట్లో బౌలర్ల పరిస్థితిపై భువీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్, బ్యాటర్ల మైండ్‌సెట్ మారడం వల్ల ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో 200 పరుగులు చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోయిందని భువనేశ్వర్ కుమార్ అభిప్రాయపడ్డాడు. “ప్రస్తుత క్రికెట్లో బౌలర్లను అందరూ బాధితుల్లా చూస్తున్నారు. కానీ నా ఉద్దేశంలో అది కేవలం చూసే కోణం మాత్రమే. ఒక బౌలర్‌గా మనం అనుకున్న చోటికే బ్యాటర్లు షాట్లు ఆడేలా చేస్తూ ఆటను పూర్తిగా మన నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు” అని భువీ స్పష్టం చేశాడు. ముఖ్యంగా సేనా దేశాల్లో పర్యటించేటప్పుడు పిచ్‌ల నుండి బౌలర్లకు పెద్దగా మద్దతు లభించడం లేదని, ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో వికెట్లు తీసి సిరీస్ గెలవడం బౌలర్లకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని పేర్కొన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు దాదాపు నాలుగేళ్లపాటు దూరంగా ఉన్నప్పటికీ, తన ప్రాక్టీస్ మరియు సన్నద్ధతను ఎప్పుడూ ఆపలేదని భువీ చెప్పాడు. “గత మూడు, నాలుగేళ్లుగా నేను ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం నా పనిని నేను చేసుకుంటూ వెళ్లడం మాత్రమే నేర్చుకున్నాను. నేను మళ్లీ భారత జెర్సీని అందుకోవాలని తాపత్రయపడలేదు. కేవలం వర్తమానంలో బ్రతకడం వల్ల నాలో ఒక వ్యక్తిగా ఎంతో పరిణితి వచ్చింది. ఐపీఎల్ ద్వారా అంచనాలు లేకుండా బరిలోకి దిగి బ్యాటర్ల అగ్రెసివ్ మైండ్‌సెట్‌ను అర్థం చేసుకోవడం నాకు బాగా ఉపయోగపడింది” అని వివరించాడు.














