విజయనగరం జిల్లా రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా, కీలక నేతగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. చిన్న శ్రీను తీసుకున్న ఈ నిర్ణయం విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైసీపీని కోలుకోలేని దెబ్బ తీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ హఠాత్ పరిణామంతో జిల్లాలో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే భయం సీనియర్ నేత బొత్సా సత్యనారాయణలో స్పష్టంగా కనిపిస్తోందనే మాట రాజకీయ వర్గాల్లో వినపడుతోంది.
మరోవైపు బొత్సా సత్యనారాయణ ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అక్కడ పార్టీని లీడ్ చేయడం, ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టడం వంటి పరిణామాలతో ఆయన ఇప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో సొంత జిల్లాలో అత్యంత నమ్మకస్తుడైన, బలమైన క్యాడర్ ఉన్న చిన్న శ్రీను వంటి నేత పార్టీని వీడటం బొత్సాకు గొడ్డలిపెట్టులా మారింది. నిన్నటివరకు జిల్లాలో వన్-మెన్ షో నడిపించిన బొత్సా, ఇప్పుడు కనీసం తన సొంత నియోజకవర్గంతో పాటు జిల్లాలోని మిగిలిన నాయకత్వాన్ని కాపాడుకోవడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోంది.
చిన్న శ్రీను టీడీపీలోకి వెళ్లడంతో జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా పసుపు కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీంతో విజయనగరంలో వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందనే ఆందోళన బొత్సా క్యాంప్‌లో వ్యక్తమవుతోంది. అటు మండలి వ్యవహారాలను చూస్తూనే.. మరోపక్క జిల్లాలో చేజారిపోతున్న క్యాడర్‌ను బుజ్జగించడానికి బొత్సా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ రాజకీయ సంక్షోభం నుంచి విజయనగరం వైసీపీని బొత్సా ఎలా గట్టెక్కిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






