Home ఆంధ్రప్రదేశ్ ధర్మవరంలో హైటెన్షన్.. సీఐ ప్రభాకర్‌పై కేతిరెడ్డి బూతుల పురాణం..!

ధర్మవరంలో హైటెన్షన్.. సీఐ ప్రభాకర్‌పై కేతిరెడ్డి బూతుల పురాణం..!

0
2

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జనసేన పార్టీ నియోజకవర్గ ముఖ్య నేత చిలకల మధుసూదన్ రెడ్డిని చంపేస్తామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగా బెదిరింపులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విచారణ చేపట్టిన పోలీస్ అధికారిపైనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో రెచ్చిపోవడం, ఫోన్‌లో దూషణలకు దిగడం ధర్మవరంలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.

కూటమి తరఫున క్షేత్రస్థాయిలో యాక్టివ్‌గా పనిచేస్తున్న జనసేన నేత చిలకల మధుసూదన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. కొందరు స్థానిక వైసీపీ నాయకులు తీవ్రమైన హింసాత్మక వ్యాఖ్యలు చేశారు. తాము అనుకున్నది జరగకపోతే చంపడానికైనా వెనకాడబోమంటూ బెదిరించడంతో, జనసేన శ్రేణులు పోలీసులను ఆశ్రయించాయి. దీనిపై స్పందించిన ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్.. సదరు వైసీపీ నాయకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ ప్రారంభించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊపేక్షించేది లేదని హెచ్చరించారు.

తమ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్‌లో పెట్టి విచారించడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. స్టేషన్‌లోనే ఉన్న రూరల్ సీఐ ప్రభాకర్‌కు ఫోన్ చేసిన కేతిరెడ్డి.. తీవ్ర నిగ్రహాన్ని కోల్పోయి బూతుల పురాణం అందుకున్నారు. “మా వాళ్లనే స్టేషన్‌కు పిలిచి విచారిస్తావా..? నీకు ఎంత ధైర్యం?” అంటూ సీఐని అసభ్య పదజాలంతో దూషించారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే ఊరుకునేది లేదని, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఫోన్‌లోనే బహిరంగంగా బెదిరింపులకు దిగినట్లు సమాచారం.

సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ధర్మవరంలో పట్టు కోల్పోయిన కేతిరెడ్డి.. ఈ స్థానిక ఎన్నికల సాకుతోనైనా మళ్లీ క్యాడర్‌లో జోష్ నింపాలని చూస్తున్నారు. అందులో భాగంగానే పోలీసులపై, కూటమి నేతలపై దూకుడు ప్రదర్శిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి విధి నిర్వహణలో ఉండగా ఫోన్ చేసి బూతులు తిట్టడం, బెదిరించడంపై పోలీస్ అసోసియేషన్, కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిని దూషించినందుకు గాను కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.