మురసు తుపాను ధాటికి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరానికి మళ్లీ బుడమేరు ముప్పు పొంచి ఉంది. గత రాత్రి నగరవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద ప్రవాహానికి తోడు స్థానికంగా పడిన భారీ వర్షం వల్ల బుడమేరు డైవర్షన్ ఛానల్ పరివాహక ప్రాంతాల్లో నీటిమట్టం గంటగంటకూ ప్రమాదకర స్థాయికి పెరుగుతోంది. కవులూరు వంతెన సమీపంలో బుడమేరు పూర్తిగా నిండి ప్రవహిస్తుండటంతో ఇరిగేషన్ శాఖ అధికారులు తీవ్ర అప్రమత్తమయ్యారు.
పరిస్థితిని సమీక్షించిన యంత్రాంగం, ముందస్తు జాగ్రత్తగా వరద ముప్పు ఉన్న కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు మరియు పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. బుడమేరు పేరు వింటేనే విజయవాడ సింగ్‌నగర్, పాయకాపురం, పైపుల రోడ్డు, నున్న ప్రాంతాల ప్రజలు నేటికీ వణికిపోతున్నారు. గతంలో అంటే.. 2024 సెప్టెంబరులో బుడమేరు గట్లు తెగి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన చారిత్రక వరద విపత్తు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఆ సమయంలో దాదాపు వారం రోజుల పాటు బెజవాడలోని సగానికి పైగా ప్రాంతాలు నీటిలోనే ఉండిపోయాయి.
వేలాది మంది సర్వస్వం కోల్పోయి ఇళ్ల డాబాలపై ఆకలితో అలమటించారు. ఆ చేదు జ్ఞాపకాలు, గడ్డు పరిస్థితులు కళ్లముందు కదలాడుతుండటంతో.. మళ్లీ ఇప్పుడు బుడమేరు ఉప్పొంగుతుందనే వార్తలతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో గట్టి చర్యలు చేపట్టింది. బుడమేరు ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, అదనపు వరద నీటిని కృష్ణా నదిలోకి మళ్లిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ పునరావాస కేంద్రాలకు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.






