రాజకీయాల్లో వారసత్వాన్ని అందిపుచ్చుకుని నిలదొక్కుకోవడం ఈ మధ్య కాలంలో కత్తిమీద సాములా మారింది. ఎంతటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి సమీకరణాలు అనుకూలించకపోతే తొలి అడుగులోనే చతికిలపడక తప్పదని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే విధమైన గడ్డు పరిస్థితి విజయనగరం జిల్లా రాజకీయాల్లో, ముఖ్యంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన బొత్స అనూష విషయంలో కనిపిస్తోందని జిల్లా వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది.
విజయనగరం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ఇటీవలే టీడీపీలో చేరడంతో విజయనగరం జిల్లా వైసీపీలో పెద్ద శూన్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే బొత్స అనూషను భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌గా అధిష్టానం నియమించింది. అయితే, ఆమె అనూహ్యంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా స్థానిక ఎన్నికల బరిలో నిలవడం చర్చనీయాంశమైంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనరేషన్ జీ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహంతో పాశల నీరజను రంగంలోకి దించింది.
ప్రారంభంలో బొత్స కుటుంబానికి ఇక్కడ ఏకపక్ష విజయం దక్కుతుందని భావించినప్పటికీ, రోజులు గడిచేకొద్దీ గ్రామాల్లో సీన్ పూర్తిగా మారిపోయింది. బొత్స అనూషకు ఈ ఎన్నికల్లో అన్నిటికంటే పెద్ద తలనొప్పిగా మారింది ఆమె బాబాయ్, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యపై స్థానికంగా ఉన్న తీవ్ర వ్యతిరేకత అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఆయనపై వ్యక్తమైన అసంతృప్తి ఇప్పుడు నేరుగా అనూష రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది. దీనికి తోడు బొత్స అనూష స్థానికేతరురాలు అనే అంశం కూడా ఓటర్లలో బలంగా నాటుకుపోయింది. రేపు గెలిచినా ఆమె మండలంలో అందుబాటులో ఉండరనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో, స్థానిక వైసీపీ క్యాడర్ కూడా ప్రచారంలో ఉత్సాహం చూపించలేక కాడి వదిలేసిన పరిస్థితి కనిపిస్తోంది.
మరోవైపు, భీమిలి ఇంచార్జ్ పదవిలో ఉంటూ ఇక్కడ జెడ్పీటీసీగా పోటీ చేయడంపై ఆమె ఇరకాటంలో పడ్డారు. ఇంచార్జ్ పదవికి రాజీనామా చేస్తే వైకాపా అధిష్టానం వద్ద తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భయం బొత్స కుటుంబంలో వ్యక్తమవుతోంది. అటు క్షేత్రస్థాయిలో ప్రచార లోపం, ఇటు టీడీపీ జిల్లా నాయకత్వం ప్రతి వార్డును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం నిర్వహించడం కూటమికి భారీ ప్లస్‌గా మారింది. బాబాయ్‌పై ఉన్న ప్రజా వ్యతిరేకతకు తోడు సొంత పార్టీ నేతల అసహకారం వెరసి.. బొత్స వారసురాలికి తొలి ప్రయత్నంలోనే ఓటమి షాక్ తప్పదనే అంచనాలు జిల్లా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.














