సినిమా స్క్రీన్ మీద రచ్చ చేయడం మెగాస్టార్ చిరంజీవికి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు కొత్తేం కాదు. కానీ ఈసారి వీరు క్రియేట్ చేసిన సెన్సేషన్ థియేటర్లలో కాదు.. ఏకంగా పొలిటికల్ కారిడార్స్‌లో. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మెగా తండ్రీకొడుకులు హైదరాబాద్‌లో దిగిన ఒక్క ఫొటో.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని, సోషల్ మీడియాను పూర్తిగా ఊపేస్తోంది. ఫొటో బయటకు వచ్చిందో లేదో నెట్టింట యాంటీ ఫ్యాన్స్ కత్తులు దూశారు.. ‘ఇదంతా కొడుకు అవార్డు కోసమే’ అంటూ ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు.
ముందుగా అసలు మ్యాటర్‌లోకి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి అమిత్ షాను కలవడానికి వెనుక ఒక స్ట్రాంగ్ అండ్ జెన్యూన్ రీజన్ ఉంది. ప్రస్తుతం యావత్ చిత్ర పరిశ్రమను, ముఖ్యంగా హీరోయిన్లను వేధిస్తున్న అతిపెద్ద భూతం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డీప్‌ఫేక్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని వాడుకుని నటీనటుల ఫొటోలను, వీడియోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ కొందరు సైకోలు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ దారుణాలపై గతంలోనే చిరంజీవి సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కేవలం ట్వీట్లతో సరిపెట్టకుండా, ఈ సమస్యకు చట్టపరమైన ముగింపు పలకాలనే పట్టుదలతో నేరుగా దేశ హోంమంత్రి అమిత్ షా ముందే ఈ ఫైల్‌ను పెట్టారు మెగాస్టార్. ఇలాంటి సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేలా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు తేవాలని చిరు డిమాండ్ చేయగా.. అమిత్ షా కూడా సమస్య తీవ్రతను అర్థం చేసుకుని, తక్షణమే యాక్షన్ తీసుకుంటామని పవర్ఫుల్ హామీ ఇచ్చారు.
ఇదంతా ఒకెత్తయితే.. యాంటీ ఫ్యాన్స్ దీనికి అల్లిన కథ ఇంకొకెత్తు. అమిత్ షాతో మీటింగ్ డీప్‌ఫేక్ కోసం కాదు, కొడుకు రామ్ చరణ్‌కు రాబోయే ‘పెద్ది’ సినిమాకి జాతీయ అవార్డు ఇప్పించుకోవడానికేనంటూ సోషల్ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. దీనికి కారణం.. గతంలో జరిగిన ‘పెద్ది’ సినిమా సక్సెస్ ఈవెంట్లో చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్. ‘రంగస్థలం సినిమాకే చరణ్‌కు అవార్డు రావాల్సింది.. ఇప్పుడు బుచ్చిబాబు తీస్తున్న పెద్ది సినిమాతో చరణ్ ఖచ్చితంగా నేషనల్ అవార్డు కొడతాడు’ అని చిరు ఆ వేదికపై నమ్మకం వ్యక్తం చేశారు. ఆ మాటలను ఇప్పుడు బయటకు తీసి.. అల్లు అర్జున్‌కు పుష్ప సినిమాకి జాతీయ అవార్డు రావడంతో మెగా ఫ్యామిలీ తట్టుకోలేక, ఢిల్లీ పెద్దలతో అవార్డుల కోసం లాబీయింగ్ చేస్తోందంటూ కొందరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.














