తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొంతమంది నాయకులు నేరుగా దాడి మొదలుపెట్టారు. ముఖ్యమంత్రుల మీద తిరగబడటం అనేది కాంగ్రెస్ లో కొత్త సంస్క్రుతి కాదు. కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నదే. 1989లో చెన్నారెడ్డి పిసిసి అధ్యక్షుడిగా వుండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా నేదురమల్లి జనార్ధననరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో అసమ్మతి నడిచింది. గెలిచిన మూడు నెలలకే మొదలుపెట్టారు. చివరకు హైదరాబాద్లో మతకలహాలకు ఈ అసమ్మతికి లింకు పెట్టారు. రాయలసీమ నుంచి వచ్చిన గూండాలే మతకలహాలకు కారణమని చెన్నారెడ్డి ఆరోపించారు. ఏడాదికే పదవీచ్యుతలయ్యారు. ఆ తరువాత నేదురుమల్లి వంతు, ఆయన సీఎం అయ్యాక మళ్లీ వైఎస్సే ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి నడిపారు. ఆయన్ను దించాక కూడా వైఎస్ కు అవకాశం దక్కలేదు. ఢిల్లీ నుంచి కోట్ల విజయభాస్కరరెడ్డిని సీఎంగా పంపారు.
2004లో వైఎస్ సీఎం అయ్యాక అసమ్మతి వ్యవహారాలు తగ్గిపోయాయి. కాంగ్రెస్ అధిష్టానం కూడా వైఎస్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. కాంగ్రెస్ లో తెలంగాణ వాదులు కూడా సైలెంట్ గానే వుండేవాళ్లు. వైఎస్ మరణం తరువాత మళ్లీ యధావిధే. రోశయ్యని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం. ఆయన హయాంలో డిఎల్ రవీంద్రా రెడ్డి, కొండా సురేఖలను మంత్రివర్గం నుంచి బయటకొచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్ల పాటు అధికారానికి దూరంగా వున్న కాంగ్రెస్ రేవంత్ నాయకత్వంలో విజయం సాధించింది. పిసిసి అద్యక్షుడిగావున్న రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ సీఎం కావడాన్ని కాంగ్రెస్ సీనియర్లు జీర్ణించుకోలేకపోయారు. వీళ్ల అభ్యంతరాలను రాహుల్ గాంధీ పక్కనపెట్టి రేవంత్ ని సీఎం చేశారు. వాస్తవానికి రేవంత్ వల్లే కాంగ్రెస్ గెలిచిందని చెప్పాలి. కాంగ్రెస్ లో కేసీఆర్ ను ఢీకొట్టేంత ఇమేజ్ వున్న నేత లేరు.
రేవంత్ సీఎం అయ్యాక ఆయనకు కొంతమంది మంత్రుల నుంచి సహాయనిరాకరణ ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఎవరూ పెద్దగా బయటపడటం లేదు. కొండా సురేఖ మాత్రం అడపా దడపా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆవిడ కుమార్తె సుస్మిత రేవంత్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీని మీద కాంగ్రెస్ సురేఖ వివరణ కోరినప్పుడు తన కుమార్తె మాటలకు తానెలా బాధ్యురాలినని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు యునానిమస్ గా సురేఖ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చెయ్యడం, అధిష్టానం సీరియస్ అవడంతో సురేఖ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.అయితే ఆయన వైపు నుంచి కూడా సానుకూలత లేదని వార్తలొచ్చాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ వివాదంపై అధిష్టానానికి సమగ్ర నివేదికను పంపించారు. ముఖ్యమంత్రి లండన్ నుంచి వచ్చిన నేపథ్యంలో సురేఖ బర్తరఫ్ జరగొచ్చన్నవార్తలొస్తున్నాయి.
సురేఖ తో పాటు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, చిన్నారెడ్డి మీద కూడా చర్యలుంటాయని భావిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ముందు నుంచి మంత్రి పదవివ్వలేదన్న అసంత్రుప్తి వుంది. ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా వున్నప్పటికీ తను కూడా కోరుకుంటున్నాడు. రేవంత్ తెలుగుదేశం నుంచి వచ్చినవాడని విమర్శిస్తుంటారు.తనతో పాటు వచ్చిన వలస నేతలకే రేవంత్ ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపిస్తుంటారు. ఆయన మధ్యలో కాంగ్రెస్ ని వదిలి బిజెపిలో చేరి, ఉపఎన్నికలో ఓడిపోయాక మళ్లీ కాంగ్రెస్ పంచన చేరిన విషయాన్ని మరచిపోతుంటారు. ఇక మాజీ మంత్రి, ప్రస్తుతం క్యాబినెట్ హోదా వున్న చిన్నారెడ్డి కూడా ఇటీవల ఘాటైన విమర్శలు చేశారు. తాను కూడా జీవన్ రెడ్డి బాటలో వెళ్లాల్సి వుంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్నవ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం స్రుష్టిస్తుంటే, రేవంత్ వ్యతిరేకులు, బిఆర్ఎస్ వర్గాలు పండగ చేసుకుంటున్నాయి.
ఇప్పుడు రేవంత్ మీద ఆరోపణలు చేస్తున్న నేతల నేపథ్యాలు పరిశీలిస్తే, వీళ్లు ముగ్గురికీ వైఎస్ కుటుంబంతో గతంలో సన్నిహిత సంబంధాలుండేవి. కొండా సురేఖ కాంగ్రెస్ లో మంత్రిగా వుండి జగన్ కోసం గొంతెత్తారు. ఆ తరువాత బిఆర్ఎస్, అక్కడి నుంచి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. కోమటి రెడ్ల కుటుంబం ముందు నుంచి వైఎస్ తో సన్నిహితసంబంధాలున్నాయి. సోదరులిద్దరూ వైఎస్ఆర్ రాజకీయ భిక్షతో ఎదిగారు. ఇప్పటికీ జగన్ తో సంబంధాలున్నాయన్న ప్రచారం వుంది.చిన్నారెడ్డి కూడా వైఎస్ కు సన్నిహితుడు. వైఎస్ ఆదేశంతోనే అధికారంలో వున్న చంద్రబాబుని ఇబ్బందిపెట్టేందుకు తెలంగాణ కోసం సంతకాల ఉద్యమం చేశారు. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా వున్నప్పుడు ఏపీలో జగన్ కు సహకరిస్తూ చంద్రబాబుని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంలుగా భిన్న పార్టీల్లో వున్నా, సహ్రుద్భావ వాతావరణంలో పనిచేసుకుంటున్నారు. అలాగే జగన్, కేసీఆర్ పార్టీలు, వాళ్ల సోషల్మీడియాలు కలిసి పనిచేస్తున్నాయి.
కాంగ్రెస్ లో అసమ్మతిని రేకెత్తించి, రేవంత్ ని గద్దె దించితే అది తెలంగాణలో కేసీఆర్ కు, ఏపీలో జగన్ కు కొంత అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే వీళ్లు రేవంత్ మీద బాణాలు ఎక్కుపెట్టారా అన్నచర్చ రాజకీయవర్గాల్లో జరుగుతా వుంది. రేవంత్ మీద వీళ్ల ఆరోపణలు, ప్రతిపక్ష బిఆర్ఎస్ కు అస్త్రాలుగా మారుతున్నాయి. మరో వైపు కొండా సురేఖని బర్తరఫ్ చేస్తే ఆమె కుమార్తె సుస్మిత బిజెపిలో కానీ జనసేనలో కానీచేరే అవకాశం వుందన్న ప్రచారం జరుగుతా వుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ వైపు నిలబడితే సురేఖని బయటకుపంపడంతో పాటు, కోమటిరెడ్డి, చిన్నారెడ్డికి హెచ్చరికలు జారీ చేసే అవకాశం వుంది. అలా కాకుండా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే, అంతర్గతంగా అసమ్మతి రగులుతూనే వుంటుంది. ముఖ్యమంత్రికి మనశ్శాంతి లేకుండా చేసే అవకాశం కూడా వుంది.














