రాజకీయాల్లో మాటలు చెప్పడం వేరు.. చేతల్లో చూపించడం వేరు అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. గత ఐదేళ్లపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. ఆయన సొంత నియోజకవర్గమైన పులివెందులలోని ప్రజల దాహార్తిని తీర్చలేకపోయారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకున్న పట్టుదల, చొరవ కారణంగా పులివెందుల రూపురేఖలు మారుతున్నాయి.
దశాబ్దాలుగా పులివెందుల నియోజకవర్గ ప్రజలను వేధిస్తున్న తాగునీటి కష్టాలకు పవన్ కళ్యాణ్ శాశ్వత విముక్తి పలికారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులివెందులకు ఎన్నో నిధులు కేటాయించామని ప్రచారం చేసుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజలకు కనీసం రక్షిత తాగునీరు కూడా అందలేదు. నిధుల కొరత, పర్యవేక్షణ లోపంతో ప్రతిష్టాత్మక ‘మెగా వాటర్ గ్రిడ్’ పథకాన్ని గత ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. ఫలితంగా పులివెందుల నియోజకవర్గ పరిసర ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ మహిళలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉండటంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పవన్ కళ్యాణ్ పులివెందుల తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. రాజకీయాలకు అతీతంగా, కేవలం ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా ‘జల్ జీవన్ మిషన్’ మరియు ‘అమరజీవి జలధార’ పథకాల కింద ఏకంగా రూ. 280 కోట్ల భారీ నిధులను విడుదల చేయించారు. నిలిచిపోయిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు డెడ్‌లైన్ విధించి, నిరంతరం సమీక్షలు జరిపారు.
పవన్ కళ్యాణ్ కఠిన పర్యవేక్షణ కారణంగా ఈ మెగా వాటర్ ప్రాజెక్టు పనులు ఇప్పుడు అద్భుతమైన ముగింపు దశకు వచ్చాయి. ప్రస్తుతం ఓవరాల్ ప్రాజెక్టు పనులు 96 శాతం పూర్తి కాగా, గ్రామాలకు నీటిని చేర్చే ప్రధాన పైప్‌లైన్ నిర్మాణం 99 శాతం పూర్తయింది. మరీ ముఖ్యంగా.. పులివెందుల పట్టణ పరిధి, పులివెందుల గ్రామీణ ప్రాంతం మరియు సింహాద్రిపురం మండలాల్లో తాగునీటి పనులు 100 శాతం విజయవంతంగా ముగిశాయి. లింగాల మండల పరిధిలోని మరో 24 మారుమూల ఆవాసాలకు కూడా రక్షిత తాగునీటి సరఫరా ప్రారంభమైంది.
ఐదేళ్ల అధికారంలో ఉండి కూడా జగన్ మోహన్ రెడ్డి తన సొంత ఓటర్ల దాహార్తిని తీర్చలేకపోతే.. పవన్ కళ్యాణ్ మాత్రం బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలల్లోనే ఈ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించారు. “జగన్ చేయలేని పనిని పవన్ చేసి చూపించారు” అంటూ పులివెందుల నియోజకవర్గ ప్రజలు మరియు మహిళలు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్ పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.







