29 C
Vijayawada
Monday, August 24, 2026
Homeఆంధ్రప్రదేశ్స్థానిక సంస్థల ఎన్నికల ముందు సర్వే మైండ్ గేమ్..? ఆత్మసాక్షి హిస్టరీ రిపీట్ అవుతుందా..?

స్థానిక సంస్థల ఎన్నికల ముందు సర్వే మైండ్ గేమ్..? ఆత్మసాక్షి హిస్టరీ రిపీట్ అవుతుందా..?

రాజకీయాల్లో మైండ్ గేమ్స్ సహజం.. ఇప్పుడు ఏపీలో వైసిపి అలాంటి మైండ్ గేమ్ కి తెరలేపింది.. వైసీపీ అనుకూల మీడియాల వేదికగా ఈప్రచారం మొదలుపెట్టింది. సెప్టెంబరు అక్టోబరు నెలల్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయన్న వార్తల నేపథ్యంలో ఒక సర్వేని రిపోర్టుని సోషల్మీడియాాలో విస్త్రుతంగా షేర్ చేస్తున్నారు. మూడ్ ఆఫ్ ఆంధ్రా పేరుతో ఇచ్చిన ఈ సర్వే వైసిపికి అనుకూలంగా వుంది.

హైదరాబాద్‌కు చెందిన ఐఐటియన్స్ గ్రూప్, ఆత్మసాక్షి నిర్వహించినట్లు చెప్తున్న ఈ సర్వేలో.. అధికార కూటమిపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 44 శాతం మద్దతుందని పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేసినా, విడివిడిగా చేసినా గెలుపు వైసిపిదే అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. వైసీపీకి 83 నుండి 112 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని, కూటమి కేవలం 62 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొన్నారు.

అలాగే ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి 44 శాతం మంది మద్దతు ఇవ్వగా, చంద్రబాబు నాయుడికి 32 శాతం మంది అనుకూలంగా ఉన్నట్లు చూపించారు. రాష్ట్రంలో అవినీతి, నిరుద్యోగం, రైతుల సమస్యలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారనేది ఈ సర్వే సారాంశం. వైసీపీ శ్రేణులు ఈ సర్వేను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ.. క్షేత్రస్థాయిలో మార్పు మొదలైందని, ఇక మా గెలుపుని ఎవరూ ఆపలేరంటున్నారు. తెలుగుదేశం, జనసేన వర్గాలు దీన్ని కొట్టిపారేస్తున్నాయి. సర్వే విశ్వసనీయత మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, పంచాయతీ వంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో సర్వేలను తెరపైకి తేవడం వెనుక ఒక పక్కా పొలిటికల్ ప్లాన్ ఉందనే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి చిత్తయిన తరువాత ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. అయితే జగన్మోహనరెడ్డి ఏ మాత్రం తగ్గకుండా ప్రకటనలు చేస్తూ, క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీని చూసి భయపడొద్దు. అన్ని చోట్ల పోటీ వుండాల్సిందే. ఏకగ్రీవం అయితే వూరుకోనని హెచ్చరిస్తున్నారు. అయినా కానీ కొన్ని చోట్ల నాయకులు ముందుకొచ్చే పరిస్థితి లేదు. అధికారంలో వాళ్లున్నారు, ఎందుకొచ్చిన డబ్బులు దండగ వ్యవహారం అని వెనక్కి తగ్గుతున్నారు. సో ఇలాంటి సర్వేలు బయటకు వదిలి అందర్నీ పోటీకి సమయత్తం  చేసే వ్యూహంతోనే సర్వేల లీకులిస్తున్నారు.

ఈ సర్వేనిజంగా ఆత్మసాక్షి చేసిందో లేదో తెలియదు కానీ, ఇదే ఆత్మసాక్షి 24 ఎన్నికలకు ముందు మళ్లీ వైసిపి గెలుస్తోందని తన సర్వేలో పేర్కొంది. కానీ ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయముంది కాబట్టి, ఇప్పుడు చేసే సర్వేలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నికలకు ఒక ఏడాది ముందు నుంచి పబ్లిక్ పల్స్ బయటకొస్తుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత వుంటే బయటపడుతుంటారు. మనం ఒకసారి గతంలోకి చూస్తే, ఉమ్మడి రాష్ట్రంలో 2013లో స్థానిక ఎన్నికలు, సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. అప్పటికే రాష్ట్ర విభజన ఖరారయింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ కష్టాల్లో వుంది.

ఏపీలో జగన్ ప్రభంజనం, తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభంజనం వుంది. సర్వే సంస్థలు కూడా అదే చెప్తున్న పరిస్థితి. కానీ ఆ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశంపార్టీ అధిక స్థానాలు సాధించింది. ఆ తరువాత 10 నెలలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి గెలిచింది. అంతకు ఏడాది ముందే జనం టిడిపిని గెలిపించేందుకు సిద్ధమయ్యారు. అలాగే 2024 ఎన్నికలకుముందు 23లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం అభ్యర్ధులు ముగ్గరూ గెలిచారు. అసాధ్యమనుకున్న రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా గెలిచారు. మొత్తం 107 నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరిగింది. ఆ తరువాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి జనసేన ఘనవిజయం సాధించాయి.

కాబట్టి ఇప్పుడే ఈ సర్వేలు నిజమని నమ్మాల్సిన పనిలేదు. అసలు సర్వేలో శాంపిల్ సైజ్ ఎంత? ఏ ప్రాంతాల్లో చేశారు. ఏయే అంశాలు అడిగారన్న స్పష్టత కూడా లేదు. కానీ దాన్ని పట్టుకుని హడావుడి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద రెండేళ్ల క్రితం వున్నంత పాజిటివ్ వుండకపోవచ్చు. అధికారంలో వున్న పార్టీ మీద అసంత్రుప్తి వుండటం సహజమే. కానీ అది ఓటమికి దారితీసేంత అసంత్రుప్తి అయితే కాదు. పైగా ఆ అసంత్రుప్తి జగన్ కు అనుకూలంగామారిన సంకేతాలైతే ఇప్పటి వరకు లేవు. సర్వేల పేరుతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారనుకోవాలి. రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో జగన్ కు 30 శాతం స్థానాలు దక్కాయంటే, కూటమి జాగ్రత్త పడాల్సి వుంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments