అమరావతి వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో జరిగిన టీడీపీ మంత్రుల బ్రేక్‌ఫాస్ట్ సమావేశం ఆసక్తిగా సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ, ప్రభుత్వ సమన్వయంపై సుదీర్ఘంగా చర్చించిన లోకేష్.. మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ ఇస్తూ అక్టోబర్ నాటికే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేయించి, ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగిపోయేలా చేసి రాష్ట్రానికి నష్టం చేయాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని.. ఆ ‘గొడ్డలి పార్టీ’ కుయుక్తులు ఇకపై పనిచేయవని లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సైతం త్వరితగతిన పరిష్కరించుకుని, అనుకున్న సమయానికి ఎన్నికలు నిర్వహించి తీరుతామని, తొలుత పురపాలక సంఘాలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, చివరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇదే సమావేశంలో ప్రజా సంక్షేమం మరియు పాలనా పరమైన అంశాలపై లోకేష్ మంత్రులతో కీలక సమీక్ష జరిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రాబోయే అక్టోబర్ నెల నుండి దశల వారీగా కొత్త పింఛన్లు అందిస్తామని, వచ్చిన దరఖాస్తులన్నింటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే, విద్యా శాఖను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు పన్నుతున్న కుట్రల పట్ల, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై జరుగుతున్న ట్రోలింగ్స్ పట్ల మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్య రంగంలో జరిగే చిన్న పొరపాట్లను కూడా కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తూ, మాట వినని అధికారులను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని, ఒకరిద్దరు అధికారుల తీరు వల్లే ఇటీవల కొన్ని సమస్యలు వచ్చాయని చెబుతూ.. అలాంటి వారిపై ప్రత్యామ్నాయ చర్యలు ఉంటాయని గట్టి వార్నింగ్ ఇచ్చారు.
రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున, ముందస్తు ప్రణాళికలు, పొదుపు చర్యలతో ఆ సమస్యను అధిగమించాలని ఆదేశించారు. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు బనాయించి, నిర్బంధించి ఈ సెప్టెంబర్ 9 నాటికి మూడేళ్లు పూర్తి కావస్తున్న విషయాన్ని లోకేష్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాటి దుశ్చర్యల నుండి ఎన్నో సవాళ్లు ఎదుర్కొని, ఈరోజు రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని.. ఆ ప్రగతిని అందరికీ గుర్తుచేసేలా సెప్టెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా భారీ కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని మంత్రులకు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక పోరులో కూటమి అభ్యర్థుల క్లీన్ స్వీప్ లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమాయత్తం చేయాలని లోకేష్ స్పష్టం చేయడంతో ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.






