బొత్స నరం లాగేసిన చంద్రబాబు!

0
5

ఎలాంటి వూహాగానాలు, ముందస్తు సమాచారం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాలో వైసిపిని చావు దెబ్బ తీశారు. ఆ పార్టీ కీలక నేత, బొత్సకు షాడోగా, మంచి ఆర్గనైజర్ గా పేరున్న బొత్స మేనమామ కుమారుడు, వైసిపి విజయనగరం జిల్లా అధ్యక్షుడు, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆలియాస్ చిన్న శ్రీను వైసిపికి గుడ్ బై చెప్పారు. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇది వైసిపికి, ముఖ్యంగా బొత్స సత్యనారాయణకు వూహించని షాక్ అని చెప్పాలి. ఎందుకంటే బొత్స రాజకీయంలో చిన్న శ్రీనే కీలకం.

1999లో బొత్స తొలిసారిగా ఎంపీ అయినప్పటి నుంచి క్షేత్ర స్థాయిలో రాజకీయాన్ని శ్రీను నడిపేవాడని చెప్తారు. కాంగ్రెస్ పార్టీలో బొత్స ఎంపీగా, మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా ఢిల్లీలో, హైదరాబాద్ లో బిజీగా వుంటే జిల్లాలో ఆయన తరపున వ్యవహారాలన్నీ ఇతనే చక్కపెట్టేవాడు. కార్యకర్తలకు అందుబాటులో వుంటూ వాళ్లకు కావాల్సిన పనులు చెయ్యడం, పార్టీ కార్యక్రమాలను, బొత్స కార్యక్రమాలను పర్యవేక్షించడం చేసేవాడని చెప్తారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బొత్సని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. శ్రీనుకు విజయనగరం జిల్లా వ్యాప్తంగా అనుచరగణం వుంది. అలాగే విశాఖ జిల్లాలో కూడా కొంతవరకు ప్రభావం చూపించగలరు.

భీమిలి నియోజకవర్గంలో వైసిపి ఇన్చార్జిగా కూడా వున్నారు. వైసిపిలో వున్నప్పుడు అధినేత జగన్ తో నేరుగా మాట్లాడే చనువుండేది. విజయనగరం జిల్లాలో జగన్ పాదయాత్ర మొత్తం చిన్న శ్రీను ఆధ్వర్యంలో జరిగింది. జగన్ సీఎంగా వున్నప్పుడు రామతీర్థం ఆలయంలో రాముని విగ్రహం తల తీసేసినప్పుడు చంద్రబాబు అక్కడకు వెళ్లినప్పుడు ఆయన్ను అడ్డుకోవడంలో శ్రీనే తెరవెనుక వున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే కోడి కత్తి వ్యవహారంలో కూడా ఈయనే కోడికత్తిని సమకూర్చారన్న విమర్శలొచ్చాయి. ఆ కేసులో ఇతను ప్రత్యక్ష సాక్షి.

జగన్ మీద దాడి జరిగాక నిందితుడి చేతిలో కత్తి లాగేసింది ఇతనే అంటారు. అలాంటి నేత ఇప్పుడు తెలుగుదేశంలో చేరడం రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలుండవనడానికి నిదర్శనం. అసలు బొత్స సత్యనారాయణే పార్టీ మారతారన్న వూహాగానాలు నెలకొన్న సమయంలో వూహించని విధంగా శ్రీను మారారు. 2024 ఎన్నికలకు ముందే బొత్స సత్యనారాయణ తెలుగుదేశంలో చేరే ప్రయత్నం చేశారని, చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారన్న వార్తలొచ్చాయి.  ఆ తరువాత ఏమైందో తెలియదు కానీ ఆయన చేరిక ఆగిపోయింది.

రీసెంట్ గా ఆయన జనసేన వైపు చూస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే గతంలో 2018 ప్రాంతాల్లో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చాక జనసేనలో చేరతారా అని ఆయనకు సన్నిహితంగా వుండే ఒక జర్నలిస్టు అడిగినప్పుడు 5,6 శాతం ఓట్లున్న పార్టీలోకి వెళ్లి ఏం చేస్తాం? 40 శాతం బలమున్న పార్టీలో చేరితే మాకున్న 5, 10 శాతం ఓట్లతో గెలుస్తాం అని కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జనసేన అధికార కూటమిలో వుంది కాబట్టి ఆయన అభిప్రాయం మారి వుండొచ్చు. చిన్న శ్రీను తెలుగుదేశంలో చేరారు కాబట్టి, ఇప్పుడు ఆయన జనసేన వైపు చూస్తారా అన్న సందేహం కూడా వుంది.

ఎందుకంటే కూటమిలో వీళ్లిద్దరి మధ్య ఆధిపత్యపోరు నడుస్తుంది కాబట్టి. అసలు చిన్న శ్రీను బొత్సతో విభేదించడానికి కారణం ఏంటన్న చర్చ కూడా నడుస్తోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు చెప్తున్నారు. ఇటీవల బొత్స సత్యనారాయణ తన కుమార్తె అనూష జడ్పీ చైర్మన్ గా పోటీ చేస్తుందని, తన రాజకీయ వారసురాలు అనూష అని ప్రకటించారు. ఇది చిన్న శ్రీనుకు నచ్చలేదంటున్నారు. శ్రీను తన కుమార్తె సహస్రని జడ్పీ చైర్మన్ గా పోటీ చేయించే ఆలోచనలో వున్నారు. బొత్స ప్రకటన ఆయన్ను నిరాశపరచింది. వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి కూడా బొత్స కుమార్తె వైపే మొగ్గారని తెలియడంతో ఇక వైసిపిలో వుండటం అనవసరం అని, తన కుమార్తెను జడ్పీ చైర్మన్ చెయ్యాలన్న లక్ష్యంతో టీడీపీలో చేరారని చెప్తున్నారు.

ఇంకెంతకాలం బొత్స నీడలో బతకాలన్న భావనలో ఈనిర్ణయం తీసుకున్నారంటున్నారు. దీంతో పాటు నెల్లిమర్ల నియోజకవర్గంలో చిన్న శ్రీను సోదరి భర్త, మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పల్నాయుడుకు బొత్స తన తమ్ముడి ద్వారా చెక్ పెట్టే ప్రయత్నం చెయ్యడం ఇద్దరి మధ్య గ్యాప్ పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమరావతిలో చంద్రబాబుని కలిసి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. మజ్జి శ్రీను చేరిక గురించి టిడిపి క్యాడర్లో కొంతమంది సానుకూలంగా వుంటే మరికొంతమంది అవసరమా అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే విజయనగరం జిల్లాలో రాజకీయ పరిస్థితులు, అక్కడ ప్రస్తుతం వున్న తెలుగుదేశం నేతలను ద్రుష్టిలో పెట్టుకుంటే శ్రీను చేరిక పార్టీకి బలమని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం విజయనగరం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపంచగల, అనుచరవర్గం గలిగిన నాయకులు లేరు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇది కీలకమైన సమయం. ఇలాంటి కీలకసమయంలో చిన్న శ్రీను చేరిక పార్టీకి బలం చేకూర్చే అవకాశం వుంది. ఉత్తరాంధ్రలో విజయనగరం పొరుగు జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖ జిల్లాల మీద కూడా ఎంతో కొంత ప్రభావం వుంటుంది. స్థానిక ఎన్నికల ముందు ఇది కచ్చితంగా వైసిపికి షాక్ అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.