భారత ఎన్నికల సంఘం (EC) అంతర్గత విభేదాలపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది. ఎన్నికల కమిషన్‌లో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తూ, శనివారం ఒక కీలక సమావేశాన్ని నిర్వహించింది. న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాలో వస్తున్న పలు ఆరోపణలపై ఎన్నికల సంఘం పాయింట్ల వారీగా వివరణ ఇచ్చింది.
ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తో పాటు ఇతర కీలక విధానపరమైన నిర్ణయాలన్నీ కమిషన్ సభ్యులందరూ ఏకగ్రీవంగానే తీసుకున్నారని ఈ భేటీ తర్వాత విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో స్పష్టం చేశారు. ఫామ్-6 నిబంధనలు, ఐటీ విభాగంలో పని విభజన, మరియు ‘ECINET’ పోర్టల్ నిర్వహణ వంటి విషయాలపై కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను ఈ ప్రకటన ద్వారా కొట్టిపారేశారు. ‘SIR’ కు సంబంధించిన అసలు ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
భవిష్యత్తులో అంతర్గత పనితీరును మరింత పటిష్టం చేసేందుకు మరియు పారదర్శకతను పెంచేందుకు కమిషన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై జరిగే అన్ని కమిషన్ సమావేశాల ఎజెండాలను ముందుగానే సభ్యులకు పంపుతారని, అలాగే సమావేశం ముగిసిన తర్వాత మినిట్స్ ను అధికారికంగా జారీ చేస్తారని వెల్లడించారు. అధికారులకు కమిషనర్లు ఇచ్చే ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ వివాదాల నేపథ్యంలో ఓటర్ల సదుపాయం కోసం దరఖాస్తుల గడువును కూడా ఈసీ పొడిగించింది. ఢిల్లీ పరిధిలో ఓటర్ల నమోదు క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు అక్టోబర్ 30 వరకు గడువు పొడిగించగా, వాటి పరిష్కారానికి నవంబర్ 30 వరకు సమయం ఇచ్చారు. అదేవిధంగా మహారాష్ట్రలో దరఖాస్తుల గడువును అక్టోబర్ 12 వరకు, వాటి పరిష్కార గడువును నవంబర్ 10 వరకు పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.














