భారత క్రికెట్ జట్టులో గత కొన్ని రోజులుగా తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో అనవసర వివాదాలు పెట్టుకోవడం మంచిది కాదనే పక్కా క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ భవిష్యత్తు విషయంలో బీసీసీఐ నుంచి వచ్చిన గట్టి సంకేతాలతో సెలెక్షన్ కమిటీ, కోచింగ్ స్టాఫ్ తమ దూకుడును తగ్గించుకున్నట్లు సమాచారం.
ఈ మొత్తం వ్యవహారంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను పక్కన పెట్టడానికి కూడా బోర్డు సిద్ధమైందనే టాక్ క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. వన్డే ప్రపంచకప్ 2027ని దృష్టిలో ఉంచుకుని రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించాలని అగార్కర్ గట్టిగా ప్రతిపాదించినట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత అగార్కర్ అనుకున్నది చేసి గిల్ కు బాధ్యతలు అప్పగించాడు. అయితే, మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ ఇమేజ్ ముందు ఈ ప్రయోగాలు చేయడం బోర్డుకు ఇష్టం లేదు.
రోహిత్ విషయంలో సెలెక్షన్ కమిటీ అతిగా వ్యవహరిస్తే.. అగార్కర్ పదవికే ఎసరు వస్తుందని బోర్డు పెద్దలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో లండన్ లో జరిగిన చివరి వన్డేలో రోహిత్ సెంచరీ తర్వాత బోర్డు అగార్కర్ కు వార్నింగ్ ఇచ్చినట్లు భోగట్టా. ఆ తర్వాత అతనిని పదవి నుంచి కూడా తప్పించే ప్రయత్నం జరిగిందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ పరిణామాలు చూసి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా కాస్త భయం పట్టుకుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా తనదైన దూకుడైన నిర్ణయాలతో ఉండే గంభీర్.. రోహిత్, విరాట్‌ల విషయంలో బోర్డు వైఖరి చూసి రూట్ మార్చారు. అందుకే ఇటీవల ఇంటర్వ్యూలలో రోహిత్ శర్మతో తనకున్న పాత సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ, సీనియర్ల అనుభవం జట్టుకు ఎంతో అవసరమంటూ క్లీన్ చిట్ ఇస్తున్నారు. కోచ్‌గా తన కెరీర్ సాఫీగా సాగాలన్నా, జట్టులో ఎలాంటి బేధాభిప్రాయాలు రాకుండా ఉండాలన్నా రోహిత్, కోహ్లీల మద్దతు తనకు అత్యంత కీలకమని గంభీర్ గ్రహించినట్లు స్పష్టమవుతోంది. మొత్తానికి బీసీసీఐ తీసుకున్న కఠిన వైఖరితో టీమిండియాలో రేగాల్సిన పెద్ద తుఫాను ముందే చల్లారినట్లయింది.






