కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తాము ఎలాంటి తక్షణ ఆదేశాలు జారీ చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ప్రతివాదిగా ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం స్పందన తమకు ఖచ్చితంగా కావాలని పేర్కొంది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ, వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
పాట్నాకు చెందిన రాకేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిల్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను గుర్తుచేసింది. ఎన్నికల సంఘంలో నిర్ణయాలు అనేవి ఏకగ్రీవంగా గానీ, లేదా మెజారిటీ సభ్యుల ఆమోదంతో గానీ జరగాలని స్పష్టం చేసింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా, మిగిలిన ఇద్దరు కమిషనర్ల సంప్రదింపులు లేకుండా సీఈసీ ఒక్కరే సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు తేలితే.. ఆయా నిర్ణయాలపై స్టే విధిస్తామని కోర్టు హెచ్చరించింది. అయితే తగిన ఆధారాలు లేకుండా తాము ముందే ఒక ముగింపునకు రాలేమని, బండిని గుర్రానికి ముందు కట్టలేమని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇటీవల మీడియాలో వచ్చిన కొన్ని కథనాల ప్రకారం.. గత 10 నెలల కాలంలో ఓటర్ల జాబితా, ఓటర్ల నమోదు, మరియు టెక్నాలజీ సిస్టమ్స్ వంటి అత్యంత కీలకమైన 14 సందర్భాలలో మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలు తమ అభ్యంతరాలను అధికారికంగా లేవనెత్తినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ అభ్యంతరాలు అంతర్గత చర్చల్లో భాగమే తప్ప, సంస్థాగత విభేదాలు కావని ఎన్నికల సంఘం ఇప్పటికే వివరణ ఇచ్చింది. పిటిషనర్ దీనిపై స్పందిస్తూ ఈ వార్తలను ఈసీ పూర్తిగా ఖండించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కానీ, పేపర్ వార్తలు వంద శాతం కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు కాబట్టి సర్టిఫైడ్ సమాచారం ఆధారంగానే తాము తదుపరి విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.






