22.5 C
Vijayawada
Sunday, November 22, 2026
Home ఆంధ్రప్రదేశ్ టీటీడీ ఉద్యోగుల కుటుంబాలకు శుభవార్త.. రూ.14 వేల విలువైన వ్యాక్సిన్ ఉచితంగా..!

టీటీడీ ఉద్యోగుల కుటుంబాలకు శుభవార్త.. రూ.14 వేల విలువైన వ్యాక్సిన్ ఉచితంగా..!

0
6

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే అత్యంత ఖరీదైన హెచ్‌పీవీ ‘గార్డాసిల్-9’ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర శనివారం తిరుపతిలోని టీటీడీ సెంట్రల్ ఆసుపత్రిలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఉద్యోగుల కుటుంబ సభ్యులు, 9 నుంచి 25 ఏళ్లలోపు పిల్లలకు పూర్తిగా ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నారు. తొలి విడతలో 2,000 డోసులను సేకరించామని, అవసరాన్ని బట్టి మరిన్ని డోసులను అందుబాటులోకి తీసుకొస్తామని ఈవో వెల్లడించారు.

బయట మార్కెట్‌లో ఒక్కో డోసుకు సుమారు రూ.13,000 నుంచి రూ.14,000కు పైగా ధర పలికే గార్డాసిల్-9 వ్యాక్సిన్‌ను, తయారీ సంస్థ నుంచి ప్రత్యేక రాయితీపై ఒక్కో డోసు రూ.3,000 చొప్పున టీటీడీ సేకరించింది. ఉద్యోగులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా టీటీడీ నిధులతోనే అర్హులైన వారందరికీ ఉచితంగా పంపిణీ చేస్తోంది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌తో పాటు ఇతర హెచ్‌పీవీ సంబంధిత క్యాన్సర్ల ముప్పును సమర్థవంతంగా తగ్గించవచ్చని, తొమ్మిది రకాల వైరస్ వేరియంట్ల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని టీటీడీ సీఎంఓ డాక్టర్ కుసుమకుమారి వివరించారు.

బాలికలతో పాటు బాలురకు కూడా ఈ టీకా ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. వయస్సు ఆధారంగా ఈ వ్యాక్సిన్ డోసులను అందించనున్నారు. 9 నుంచి 14 ఏళ్లలోపు వారికి మొదటి డోసు వేసిన ఆరు నెలల తర్వాత రెండో డోసు ఇస్తారు. ఇక 15 నుంచి 25 ఏళ్లలోపు వారికి మొదటి డోసు తర్వాత రెండు నెలలకు రెండో డోసు, ఆరు నెలలకు మూడో డోసు వేయనున్నారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ప్రారంభించిన ఈ ఉచిత వ్యాక్సినేషన్ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈవో కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు, వైద్యులు డాక్టర్ శివకుమార్, పారామెడికల్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో టీటీడీ ఉద్యోగులు, వారి పిల్లలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.