మమతా బెనర్జీ ఫార్ములా ఫాలో అవుతున్న బొత్సా అనూష..!

0
6

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా మార్కెటింగ్, పీఆర్ స్ట్రాటజీలు సరికొత్త రూపు సంతరించుకుంటున్నాయి. సాధారణంగా ఏ పార్టీలోనైనా అధినేతకు లేదా సదరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థికి మాత్రమే పరిమితమయ్యే సోషల్ మీడియా హడావుడి.. ఇప్పుడు ఒక యువ నాయకురాలి చుట్టూ రాష్ట్రవ్యాప్తంగా తిరగడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బొత్సా కుటుంబ వారసురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బొత్సా అనూష అనుసరిస్తున్న సరికొత్త పొలిటికల్ మార్కెటింగ్ వ్యూహాలు ఇప్పుడు వైసీపీతో పాటు ప్రత్యర్థి పార్టీల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.

పొలిటికల్ ల్యాండ్‌స్కేప్‌లో బొత్సా అనూష మార్కెటింగ్ శైలిని గమనిస్తున్న విశ్లేషకులు.. ఆమె పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గతంలో అనుసరించిన వ్యూహాన్ని ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో బెంగాల్‌లో మమతా బెనర్జీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పాపులారిటీ సాధించడానికి, విపక్షాలను తట్టుకొని సీఎం పీఠాన్ని దక్కించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా నెట్‌వర్క్‌లను, డిజిటల్ ఫ్యాన్ పేజీలను క్రియేట్ చేయించి భారీగా ప్రమోషన్స్ రన్ చేయించారు.

ఇప్పుడు అదే తరహాలో బొత్సా అనూష తన పీఆర్ టీంకు భారీగా నిధులు కేటాయించి, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా బ్రాండ్ ఇమేజ్‌ను బిల్డ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ఏ నాయకుడైనా తాము పోటీ చేసే సొంత నియోజకవర్గం లేదా సొంత జిల్లా పరిధిలోనే డిజిటల్ ప్రమోషన్లకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ, బొత్సా అనూష మాత్రం అందుకు భిన్నంగా రాష్ట్రవ్యాప్తంగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నియోజకవర్గాల వారీగా ఫ్యాన్ పేజీలను క్రియేట్ చేయిస్తూ.. వాటికి పెయిడ్ ప్రమోషన్ల ద్వారా విపరీతమైన హైప్ తీసుకువస్తున్నారు.

ఉదాహరణకు.. “కోనసీమ బొత్సా అనూష ఆర్మీ”, “విజయవాడ బొత్సా అనూష ఆర్మీ” అంటూ జిల్లాల వారీగా ప్రత్యేక విభాగాలు పుట్టుకురావడం, వాటి వెనుక పీఆర్ టీంలు భారీగా ఖర్చు పెట్టడం వెనుక బలమైన రాజకీయ భవిష్యత్తు ప్రణాళిక ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీలో సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్ బిల్డింగ్ మాత్రమే. కానీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న హడావుడి చూస్తుంటే.. కొన్ని ఏరియాల్లో పార్టీ అధినేత జగన్ కంటే కూడా బొత్సా అనూష మార్కెటింగ్ గ్రాఫ్ వేగంగా పెరుగుతోందని పొలిటికల్ సర్కిల్స్‌లో ఇంటర్నల్ చర్చ నడుస్తోంది.

పార్టీ కష్టకాలంలో ఉన్న ఇలాంటి తరుణంలో.. కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్త లీడర్‌గా ఎదగాలనే లక్ష్యంతోనే ఆమె డిజిటల్ మీడియాను ఒక పవర్‌ఫుల్ అస్త్రంగా వాడుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కార్పొరేట్ స్టైల్‌లో సాగుతున్న బొత్సా అనూష నయా పొలిటికల్ గ్యాంబ్లింగ్ భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి పొలిటికల్ మైలేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.