జగన్ క్రిమినల్ పాలిటిక్స్‌తో రాష్ట్రానికే ప్రమాదం: చంద్రబాబు

0
3

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన సీఎం.. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి మనస్తత్వంతో పోల్చితే జగన్ మనస్తత్వం పూర్తిగా భిన్నమైనదని, ఇది రాష్ట్రానికే అత్యంత ప్రమాదకరమని కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ ఏ విధంగా హింసను ప్రోత్సహించిందో వివరిస్తూ, సదరు ఘటనలకు సంబంధించిన వీడియోలను చంద్రబాబు ఈ సమావేశంలో మీడియాకు ప్రదర్శించారు.

గత ఐదేళ్ల వైసీపీ అస్తవ్యస్త పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ విధ్వంసానికి గురైందని, తాము అధికారంలోకి వచ్చాకే వ్యవస్థలన్నీ మళ్లీ ఒక క్రమపద్ధతిలోకి వస్తున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తులు నక్సలైట్ల రూపంలో ఉండేవని, కానీ నేడు దురదృష్టవశాత్తూ ఒక రాజకీయ పార్టీ వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని మండిపడ్డారు. నేరగాళ్లను, రౌడీయిజం చేసే వారిని ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని, ఓటర్ల తీర్పు ఎప్పుడూ ప్రభుత్వాల పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని గుర్తుచేశారు

తన రాజకీయ ప్రస్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను శాసించిన నక్సలిజాన్నే తన ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టి పూర్తిగా అణచివేశానని, అలాంటిది ఇప్పుడు కొందరు చేస్తున్న రౌడీ రాజకీయాలకు తాను భయపడబోనని చంద్రబాబు హెచ్చరించారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారి పట్ల కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, రాష్ట్రంలో అరాచక శక్తులకు తావులేకుండా ప్రజలందరికీ పూర్తి రక్షణ కల్పిస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.