రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన రాప్తాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిపై దాడి కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పాఠశాల గదిలోకి చొరబడి పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో కిరాతకంగా దాడి చేసిన ప్రధాన నిందితుడు హేమంత్‌పై పోలీసులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. తప్పించుకునే క్రమంలో పోలీసు అధికారులపైనే నిందితుడు తిరగబడటంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఉదంతంపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అత్యవసరంగా ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
పాఠశాలలో దారుణానికి ఒడిగట్టి పరారైన హేమంత్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో నిందితుడు దాక్కున్నాడనే ఖచ్చితమైన సమాచారంతో పోలీస్ బృందాలు అక్కడ శోధన చేపట్టాయి. పోలీసులను గమనించిన హేమంత్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ, అడ్డుకోబోయిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పై కత్తి, రాళ్లతో విచక్షణారహితంగా ఎదురుదాడికి దిగాడు. ఈ దాడిలో సీఐ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడానికి, ఆత్మరక్షణ కోసం పోలీసులు నిందితుడి కాళ్లపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు.
తీవ్ర బుల్లెట్ గాయాలైన హేమంత్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు అతని కాళ్లలో దిగిన 3 బుల్లెట్లను విజయవంతంగా తొలగించారు. మరోవైపు ఈ పోలీసు కాల్పుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో, దీనిపై సమగ్రమైన, నిష్పాక్షికమైన స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఘటనా స్థలానికి సంబంధించిన వీడియో ఫుటేజీలు, సీసీటీవీ రికార్డులు, నిందితుడి వైద్య నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాలన్నింటినీ భద్రపరచాలని పిటిషనర్ కోరారు.
కాల్పుల్లో గాయపడిన నిందితుడు హేమంత్ యొక్క అధికారిక వాంగ్మూలాన్ని నేరుగా మేజిస్ట్రేట్ సమక్షంలోనే రికార్డు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీజీపీ, జిల్లా కలెక్టర్‌తో పాటు మరో తొమ్మిది మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్ పిటిషన్‌ను అత్యవసరంగా రేపు విచారించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవైపు బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధిత బాలిక ఆరోగ్యంపై యావత్ రాష్ట్రం ఆందోళన చెందుతుండగా, మరోవైపు ఈ కాల్పుల ఉదంతం న్యాయస్థానం మెట్లు ఎక్కడం సంచలనంగా మారింది.














